తెలుగు బుల్లితెర పాపులర్ షో బిగ్‌బాస్ మూడో సీజన్ తొలి వారం కంప్లీట్ చేసుకుని రెండోవారంలోకి ఎంట్రీ ఇచ్చింది. బిగ్ బాస్ విన్నర్ అవ్వాలని కంటెస్టెంట్లు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తమ పేరిట బయట సోషల్ మీడియాలో నానా హంగామా చేస్తున్నారు. ఇప్పటికే శ్రీముఖి ఆర్మీ హడావిడి స్టార్ట్ అయింది. ఇదిలా ఉంటే బిగ్ బాస్ 3 కు భారీ రేటింగ్‌లు వస్తున్నాయంటూ పెద్ద హంగామా చేస్తున్నారు. వాస్తవంగా చూస్తే బిగ్ బాస్ రెండో సీజన్ రేటింగుల్లో చాలా వెనుకబడి ఉంది.
ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్‌తో పోలిస్తే నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఎక్కువ రేటింగులు రాలేదు. ఇక ఇప్పుడు మూడవ సీజన్ ప్రారంభం అయ్యాక ఒకటి రెండు రోజులు మినహాయిస్తే ఆ తర్వాత ఈ షో గురించి పెద్దగా పట్టించుకున్న వారు లేరు. షో నాగ్ వచ్చిన వీకెండ్స్‌లో మినహా మిగిలిన రోజుల్లో అంత ఆసక్తిగా లేకపోవడం… మిగిలిన ఛానల్స్ లో అదే టైం కు కావలసినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుండడంతో బిగ్ బాస్ ను గంటసేపు చూసేందుకు ఎవరు ఇష్టపడటం లేదు.
అయితే షో రేటింగుల్లో దుమ్మురేపుతోందని ప్రకటించుకోవడం మాత్రం పలు అనుమానాలకు తావిస్తోంది. బిగ్‌బాస్ 3 రేటింగుల విషయంలో చాలా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మొదటి రోజు 17.9తో టాప్‌లో ఉందని… మొదటి వారాన్ని దాదాపు 60శాతం మంది, సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ షోను 44 శాతం వీక్షించినట్లు వాళ్లు చెపుతున్నారు. ఎన్టీఆర్ హోస్ట్ చేసిన తొలి సీజన్ తొలి ఎపిసోడ్‌కు 16.18 రేటింగ్ రాగా, నాని హోస్ట్ చేసిన రెండో సీజన్‌కు ఫస్ట్ ఎపిసోడ్‌కు 15.05 రేటింగ్ వచ్చింది.
వీళ్లిద్దరినీ వెనక్కి నెట్టిన నాగ్ తొలి ఎపిసోడ్‌కు 17.9 రేటింగ్ సాధించి టాప్ ప్లేస్‌లో నిలిచాడంటున్నా వాస్తవంగా ఆ స్థాయి రేటింగులపై చాలా సందేహాలే ఉన్నాయి. ఎన్టీఆర్ రెండేళ్ల క్రితమే 16.18 రేటింగ్ తెస్తే ఇప్పుడు నాగ్ రెండేళ్ల తర్వాత హోస్ట్‌గా వచ్చినా కేవలం 1 శాతం మాత్రమే రేటింగ్ పెరిగింది. అది కూడా రేటింగ్ లేకపోయినా కావాలనే పెంచి చూపించారని అంటున్నారు. మొత్తానికి బిగ్ బాస్ వివాదాల్లాగానే రేటింగులు కూడా వివాదాలతోనే నడుస్తున్నాయి.