ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ అబ్బాయి, అల్లు అర్జున్ సోదరుడుగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన అల్లు శిరీష్ సక్సెస్ కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకూ మెగా కాంపౌండ్ నుంచి వచ్చిన హీరోలంతా ఏదో సినిమాతో టర్న్ తీసుకున్నారు. కానీ అల్లు శిరీష్ కి మాత్రం కెరీర్ లో సరైన బ్రేక్ రాలేదనే చెప్పుకోవాలి. ఒక పక్క అన్న అల్లు అర్జున్ మాత్రం వరస హిట్లతో దూసుకుపోతూ.. అభిమానుల గుండెల్లో స్టైలిష్ స్టార్‌గా ముద్ర వేసుకున్నాడు.
ఇటీవల అల్లు శిరీష్ హీరోగా మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఎబిసిడి చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఖచ్చితంగా సక్సెస్‌ను అందిస్తుందనే ఉద్దేశంతో ‘ఏబీసీడీ’ని అదే పేరుతో తెలుగులో చేశాడు. కానీ తెలుగులో ఆ సినిమా వర్కవుట్ కాలేదు. బాక్సాఫీస్ దగ్గర ‘ఏబీసీడీ’ బోల్తా కొట్టింది. ఇన్ సైడ్ టాక్ ప్రకారం కొత్త కథలేవి తన దగ్గరకు రావడం లేదట.
అలాగే ఏ కథ వచ్చినా ఒప్పుకోకపోవడం ఒకటైతే.. తాను నటించే సినిమా వ్యవహారాల్లో శిరీష్ ఎక్కువ జోక్యం చేసుకుంటాడనే టాక్ కూడా ఉంది. దీంతో శిరీష్‌కు సక్సెస్ లేక మార్కెట్ కూడా పెరగకుండా పోయింది. అగ్రనిర్మాత కొడుకుగా ఉండిగా కూడా శిరీష్‌తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు వెనకడుగు వేస్తున్నారు. కొందరు నాన్న అల్లు అరవింద్ కు నిర్మాణ వ్యవహారాల్లో తోడుగా ఉంటే గీతా ఆర్ట్స్ ని ఇంకో లెవెల్ కు తీసుకెళ్లవచ్చనే కోణంలో సలహాలు ఇస్తున్నారట.
నిజానికి శిరీస్ కెరియర్‌లో పరశురామ్ డైరెక్షన్లో చేసిన సినిమా `శ్రీరస్తు శుభమస్తు` ఓ మోస్తరు హిట్ ఇచ్చింది. ఆ తర్వాత ఇలాంటి సినిమా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు కానీ ఒక్కటి కూడా దరిచేరడం లేదు. మరి హిట్టో ఫట్టో సినిమాల్లోనే ఉంటాడా? లేదా? గీతా ఆర్ట్స్ వ్యవహారాలు చూసుకుంటాడో క్లారిటీ రావాల్సి ఉంది.