ప్రపంచకప్ క్రికెట్ టోర్నమెంటులో దాయాది దేశం పాకిస్తాన్ సెమీ ఫైనల్‌కు చేరడం దాదాపు అసాధ్యమని తేలిపోయింది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై.. ఇంగ్లండ్ విజయం సాధించడంతో పాక్ సెమీస్ దారులు మూసుకుపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో మెగాటోర్నీలో నిలవాలంటే బంగ్లాదేశ్‌తో శుక్రవారం జరిగే మ్యాచ్‌లో పాక్ కనివినీ ఎరుగని రీతిలో విజయం సాధించాలి. అసలు క్రికెట్ పుట్టాక ఏ జట్టు గెలవని రికార్డు విజయం సాధించాలి.
బంగ్లాతో మ్యాచ్‌లో తప్పనిసరిగా పాక్ మొదట బ్యాటింగ్ చేయాలి. కనీసం 316 పరుగుల తేడాతో బంగ్లాదేశ్‌ను ఓడించాలి. అలా అయితేనే అవకాశాలు సజీవంగా ఉంటాయి. వన్డే చరిత్రలో ఇప్పటివరకు ఇంత భారీ తేడాతో ఏ జట్టూ గెలిచిన దాఖలాలు లేవు. ఒకవేళ బంగ్లాదేశ్ తొలుత బ్యాటింగ్ చేస్తే మాత్రం పాక్ ఎలాంటి సమీకరణలు లేకుండానే ఇంటికి వచ్చేస్తుంది.
పాక్ ముందు బ్యాటింగ్ చేసి 350 పైన పరుగులు చేస్తే 311 పరుగుల తేడాతో గెలవాలి. పాక్ 400 పరుగులు సాధిస్తే 316 పరుగుల తేడాతో విజయం అవసరం. అదే 450 పై చిలుకు పరుగులు సాధిస్తే అప్పుడు 321 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించాలి. ఒక వేళ బంగ్లా తొలుత బ్యాటింగ్ చేస్తే పాక్ ఎంత గొప్ప విజయం సాధించినా సెమీస్‌కు రాదు.
బంగ్లాతో మ్యాచ్‌లో పాక్ గెలిచినా న్యూజిలాండ్‌తో సమానంగా 11 పాయింట్లు వస్తాయి. అయితే నెట్ రన్ రేటు విషయంలో మాత్రం చాలా వెనకపడడంతో ప్రపంచకప్ నుంచి నిష్క్రమించక తప్పని పరిస్థితి.