సంక్రాంతికి చేతులు ఎత్తేసిన హీరోగారు…

టాలీవుడ్‌లో 2020 సంక్రాంతికి ఈసారి గట్టి పోటీ వుంటుందని, నాలుగైదు సినిమాలు రిలీజ్ అవుతాయ‌ని.. ఏ సినిమా ఎలా ఉంటుంది ? అస‌లు థియేట‌ర్లు దొర‌కుతాయా ? అన్న అనుమానాలు నిన్న‌టి వ‌ర‌కు ఉన్నాయి. మహేష్‌బాబు – అనిల్ రావిపూడి సరిలేరు నీకెవ్వరు, త్రివిక్రమ్ – అల్లు అర్జున్ మూవీ, నాగార్జున, రమ్యకృష్ణ, నాగచైతన్య కాంబినేషన్లో వస్తున్న బంగార్రాజు… బాలయ్య – కె.ఎస్.రవికుమార్ సినిమా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సినిమాలు సంక్రాంతిపై కన్నేశాయి.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాల్లో ఓ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. అదే బంగార్రాజు. ఈ సినిమా ఇంకా షూటింగ్ కూడా స్టార్ట్ కాలేదు. మన్మధుడు 2 ఆగస్టు 9న రిలీజ్ అవుతుండటంతో… ఆ వెంటనే బంగార్రాజు స్టార్ట్ చేసి సంక్రాంతికి రిలీజ్ చేయాలని నాగార్జున డిసైడ్ అయ్యాడు. అయితే ఈ నెల నుంచి మూడు నెలల పాటు బిగ్ బాస్ 3 హౌస్ లో బిజీగా ఉంటాడు. ఇక నాగచైతన్య ప్రస్తుతం వెంకీ మామా.. ఆ తర్వాత శేఖర్ కమ్ముల సినిమాతో బిజీ కానున్నాడు. ఇవన్నీ ఆలోచించే నాగార్జున ఈ సినిమాను సమ్మర్ కు రెడీ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

అంటే బంగార్రాజు ఇప్ప‌ట్లో సెట్స్‌మీద‌కు వెళ్ల‌దు. ఇక బంగార్రాజు విష‌యానికి వస్తే నాగ్‌కు సోగ్గాడే చిన్ని నాయ‌న సినిమాతో బంప‌ర్ హిట్ ఇచ్చిన కుర‌సాల క‌ళ్యాణ్‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. అదే క‌ళ్యాణ్ నాగచైత‌న్య‌కు రారండోయ్ వేడుక చూద్దాం లాంటి హిట్ కూడా ఇచ్చాడు. ఈ సినిమా కోసం క‌ళ్యాణ్ అదిరిపోయే స్క్రిఫ్ట్ రెడీ చేసుకున్న‌ట్టు తెలుస్తోంది.

Leave a comment