సినిమా: దొరసాని
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్, వినయ్ వర్మ, తదితరులు
డైరెక్టర్: కేవీఆర్ మహేంద్ర
నిర్మాతలు: మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని
సంగీతం: ప్రశాంత్ ఆర్ విహారి
సినిమాటోగ్రఫీ: సన్నీ కుర్రపాటి
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడిగా ఇండస్ట్రీకి పరిచయమవుతున్న ఆనంద్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘దొరసాని’ మొదట్నుండీ ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది. రాజశేఖర్-జీవితల రెండో కూతురు శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమాపై మంచి బజ్ ఏర్పడటంతో ఈ సినిమాకోసం చాలా ఆసక్తిగా చూస్తున్నారు. కాగా శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం.
కథ:
ఊరికి పెద్దయిన దొర(వినయ్ వర్మ) గ్రామాన్ని తన కన్నుసైగల్లో ఉంచుకుంటాడు. చిన్నదొరసాని దేవకి(శివాత్మిక రాజశేఖర్)ను ఎవ్వరికీ కనిపించకుండా పెంచాలని చూస్తాడు. ఈ క్రమంలో పేదవాడైన కూలీ కొడుకు రాజు(ఆనంద్ దేవరకొండ) తన స్నేహితలకు కలిసి జాలీగా జీవిస్తుంటాడు. కట్ చేస్తే.. ఒక సందర్భంగా చిన్న దొరసానిని చూసిన రాజు ఆమెను ఇష్టపడతాడు. కాగా ఆమెను ప్రేమిస్తున్నట్లు దొరసానికి తెలుస్తుంది. దీంతో ఆమె కూడా రాజును ప్రేమిస్తుంది. ఒకరినొకరు ప్రేమించుకుంటున్న సంగతి రాజు స్నేహితులకు కూడా తెలుస్తోంది. కట్ చేస్తే.. వీరి ప్రేమ గురించి తెలుసుకున్న దొర రాజు తల్లిదండ్రులను హింసిస్తాడు. రాజును పోలీసులకు పట్టించి అతడి చిత్రహింసలు పెడుతాడు. అతడిని మర్చిపోవాలని దేవకిని కూడా బెదిరిస్తాడు. రాజు, దొరసాని ప్రేమకథ చివరకు ఏమౌతుంది..? వారిద్దరు చివరకు ఒకటవుతారా..? అనేది సినిమా కథ.
విశ్లేషణ:
తెలంగాణలో 1980 కాలం నాటి పరిస్థితులను మనకు ఈ సినిమాలో చూపించారు. దొరల కాలం నడుస్తున్న సమయంలో ఈ చిత్ర కథ నడుస్తోంది. పేదవాడైన రాజు, దొర కూతురు దొరసానిని ప్రేమిస్తాడు. అతడి మంచి మనసును చూసిన దొరసాని కూడా రాజు అంటే ఇష్టపడుతుంది. అయితే వారి ప్రేమను దొర వ్యతిరేకిస్తాడు. వారిద్దరినీ ఒకటి చేయడం అస్సలు ఇష్టంలేని దొర వారిని ఏం చేశాడనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కేవీఆర్ మహేంద్ర.
ఒక సాధారణ కథను అద్భుతంగా ప్రెజెంట్ చేయడంలో దర్శకుడు పూర్తిగా సక్సెస్ అయ్యాడు. ప్రేమకు పేద, గొప్ప అనే తేడాలు లేవని దొరసాని చిత్రం మరోసారి ప్రూవ్ చేసింది. దర్శకుడు ఎంచుకున్న కథను ఉన్నది ఉన్నట్లుగా ఎక్కడా తడబడకుండా చూపించాడు. కొత్త నటీనటులు అయినప్పటికీ వారి పర్ఫార్మెన్స్‌తో దొరసాని మూవీ ప్రేక్షకులను ముమ్మాటికి మెప్పిస్తుంది. కథాకథనాలకు అనుగుణంగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది.
ఇక హీరోహీరోయిన్లు కొత్తవారనే ఫీలింగ్ మనకు ఎక్కడా రాదు. వారిలో ఉన్న ట్యాలెంట్‌తో సినిమాను ఎక్కడా పక్కదారి పట్టకుండా చేశారు. ముఖ్యంగా రొమాంటిక్, ఎమోషనల్ సన్నివేశాలలో ఆనంద్, శివాత్మికల పర్ఫార్మెన్స్ సూపర్. ఓవరాల్‌గా ఓ మంచి ప్రేమకథను అంతే మంచిగా తెరకెక్కించిన కొత్త దర్శకుడు కేవీఆర్ మహేంద్ర తొలి సినిమాతో విజయం సాధించి తన ట్యాలెంట్‌ను ప్రూవ్ చేసుకున్నాడు.
నటీనటులు పర్ఫార్మెన్స్:
ఆనంద్ దేవరకొండ, శివాత్మిక రాజశేఖర్‌లకు ఇది తొలిసినిమా అయినప్పటికీ వారిద్దరు తమ పాత్రల్లో జీవించేశారు. ముఖ్యంగా రొమాంటిక్, ఎమోషన్ సీన్స్‌లో వారి ట్యాలెంట్‌ను చూపించారు. కొన్ని సీన్స్‌లో వారి యాక్టింగ్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతారు. ఇక దొర పాత్రలో నటించిన వినయ్ వర్మ సినిమాలో మరో ముఖ్యమైన పాత్ర పోషించాడు. మిగతా నటీనటులు తమ పరిధిమేర బాగా నటించారు.
టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడిగా తొలి చిత్రం డైరెక్ట్ చేసిన కేవీఆర్ మహేంద్ర, తన సత్తా ఏమిటో దొరసాని చిత్రంతో ప్రూవ్ చేశాడు. కొత్తవారితో తాను ఏం తీయాలనుకున్నాడో.. దాన్ని పర్ఫెక్ట్‌గా చూపించాడు. ఒక సాధారణ కథను అద్భుతంగా తెరకెక్కించిన దర్శకుడు సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా తెరకెక్కించాడు. ఇక ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ సంగీతం. ముఖ్యంగా సినిమాలో వచ్చే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాలో లీనమయ్యేలా చేస్తుంది. సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉండటంతో సినిమాను రెప్పార్పకుండా చూస్తారు.
చివరగా:
ఆకట్టుకునే ‘దొరసాని’ ప్రేమ యుద్ధం..!
రేటింగ్:
3.0/5.0