టాలీవుడ్ లో సరైన కథలను ఎంపిక చేసుకోవటంలో గాని…. సినిమా ఫలితాలను ముందుగా అంచనా వేసి డిస్ట్రిబ్యూషన్ చేయడంలోగాని దిల్ రాజుకు దిల్ రాజే సాటి అన్న పేరు ఉంది. దిల్ రాజు ఓ మంచి కథను ఎంచుకొని సరైన డైరెక్టర్‌తో సినిమా చేస్తే… హీరోతో సంబంధం లేకుండా ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టవచ్చు అన్న విషయం గతంలో చాలాసార్లు రుజువయ్యింది. ఇక దిల్ రాజు ఒక సినిమాను పంపిణీ చేస్తున్నాడు అంటే… ఆ సినిమా రిలీజ్‌కు ముందే సగం హిట్ అన్న టాక్ ఇండస్ట్రీలో ఉండేది.
ఇండస్ట్రీపై రాజుకు అంత ఖచ్చితమైన గురి ఉండేది. అయితే ఇదంతా గతం.. ఇప్పుడు రాజు డిస్ట్రిబ్యూషన్ అంటే అగ్రశ్రేణి నిర్మాతలు సైతం ఆయనకు పంపిణీ హక్కులు ఇచ్చేందుకు వెనుకాడతున్నారట. ఎందుకంటే రాజు పంపిణీ చేసిన సినిమాలన్నీ ఇటీవల బాక్సాఫీస్ వద్ద ఫట్ అవుతున్నాయి. దీంతో దిల్ రాజు లెక్క ఎక్కడ తప్పుతుందా ? అన్నది ఇండస్ట్రీలో సంచలన టాపిక్ అయ్యింది.
ఇక తాను నిర్మాతగా తీసిన సినిమాలు మినహాయిస్తే… తాను డిస్ట్రిబ్యూషన్ చేసిన సినిమాలు వరుసగా ప్లాప్ అవుతుండడంతో రాజు భారీగా నష్టపోయినట్టు కూడా తెలుస్తోంది. ఇటీవల రాజు డిస్ట్రిబ్యూషన్ చేస్తోన్న చిన్న సినిమాలకు సైతం రాజు భారీగా హడావిడి చేస్తుండడంతో ఇండస్ట్రీ రాజు చిన్న సినిమాలకు ఇంత హడావిడి ఎందుకు చేస్తున్నారు ? అయినా ఊరూపేరు లేని వాటికి అంత హంగామా అవసరమా ? అన్న గుసగుసలు కూడా విన్పిస్తున్నాయ్.
మరోవైపు సురేష్‌బాబు మాత్రం చిన్న సినిమాలకు బ్యాక్ అప్ ఇచ్చి సేఫ్ వెంచర్ చేసుకుంటున్నాడు. ఈ విషయంలో మాత్రం రాజు పెద్దా, చిన్నా తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేస్తూ నష్టాలు కొని తెచ్చుకుంటున్నాడట. మొత్తానికి డిస్ట్రిబ్యూషన్ పరంగా రాజుకు టైం కలిసి రావడం లేదట.