హీరోయిన్ అమలాపాల్ – కోలీవుడ్ దర్శకుడు ఏఎల్ విజయ్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఎంతో అన్యోన్యంగా సాగిన వీరి వైవాహిక జీవితం కేవలం రెండేళ్లకే పెటాకులు అయ్యింది. వీరు విడిపోవడానికి అమలపై విజయ్ ఫ్యామిలీ పెట్టిన ఆంక్షలే అని అప్పట్లో టాక్ బయటకు వచ్చింది. విజయ్ నుంచి విడిపోయాక అమల వరుస పెట్టి సినిమాలు చేస్తోంది.
తెలుగులో కూడా ఆమె పలు సినిమాల్లో నటించింది. మెగా ఫ్యామిలీ హీరో రామ్‌చరణ్‌తో నాయక్ సినిమాలో కూడా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు విజయ్ మరో పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ విషయాన్ని విజయ్ స్వయంగా ప్రెస్‌నోట్ ద్వారా వెల్లడించాడు. తాను జూలైలో పెళ్లి చేసుకోబోతున్నట్టు చెప్పిన అతడు… తమది పెద్దలు కుదిర్చిన పెళ్లి అని కూడా ప్రకటించాడు. తమిళనాడులోని మన్నివక్కమ్ ప్రాంతానికి చెందిన ఐశ్వర్య అనే డాక్టర్ విజయ్ జీవితంలోకి రెండో భార్యగా రాబోతుంది.
ఇక అమల నుంచి విడిపోయాక విజయ్ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. తమన్నా – ప్రభుదేవా కాంబోలో అభినేత్రి, అభినేత్రి-2తో పాటు మధ్యలో లక్ష్మి, కణం లాంటి మరో రెండు సినిమాలు కూడా డైరక్ట్ చేశాడు. పెళ్లి తర్వాత కంగనారనౌత్ లీడ్ రోల్ లో జయలలిత బయోపిక్ ను సెట్స్ పైకి తీసుకురాబోతున్నాడు విజయ్.