నటీనటులు: ప్రియదర్శి, అనన్య, ఝాన్సీ, చక్రపాణి
నిర్మాణ సంస్థలు: సురేశ్ ప్రొడక్షన్స్, స్టూడియో 99
పాటలు: గొరేటి ఎంకన్న, చంద్రబోస్, దాశరథి
డైలాగ్స్: పెద్దింటి అశోక్ కుమార్
సంగీతం: మార్క్ కె.రాబిన్
దర్శకత్వం: రాజ్.ఆర్
తెలుగు చిత్రసీమలో ప్రస్తుతం బయోపిక్‌లు ఎక్కువగానే వస్తున్నాయి. ఇవ్వన్నీ కూడా దాదాపుగా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాయి. సావిత్రి, ఎన్టీఆర్.. ఇలా జనంలో మంచి ఇమేజ్ ఉన్న నటులు, రాజకీయ నేతల జీవితాంశాలతో బయోపిక్ తీయడం ఒక ఎత్తైతే.. జనంతో పెద్దగా పరిచయం లేని ఓ అసామన్యుడి జీవితాన్ని తెరపై ఆవిష్కరిండం మరోఎత్తు. ఇప్పుడు అదే సాహసం చేశాడు దర్శకుడు రాజ్. ఆర్. ఆ అసామన్యుడే ఆసు యంత్రాన్ని కనిపెట్టి చేనేత కార్మికుల కష్టాలను తీర్చిన చింతకింది మల్లేశం. ఆయన జీవిత కథాంశంతో మల్లేశం పేరుతో ఆయన బయోపిక్‌ను తెరకెక్కించాడు. ఇందులో కమెడియన్ ప్రియదర్శి మల్లేశం పాత్రలో నటించాడు. అయితే..ఈ సినిమా ఎంతమేరకు ప్రేక్షకులను మెప్పించిందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కథేమిటంటే…
అది నల్గొండ జిల్లాలోని ఓ చిన్న పల్లె. చింతకింద మల్లేశం కుటుంబం ఇక్కడే ఉంటోంది. చేనేత కుటుంబం. అప్పుల బాధ. ఆరో తరగతిలోనే మల్లేశం చదువు మానేసి, తండ్రికి సాయంగా ఉంటాడు. భర్త, కొడుకు చేనేత పని చేస్తుంటే వారికి ఆసును అమర్చడానికి మల్లేశం తల్లి లక్ష్మిపని చేస్తుంది. ఈ క్రమంలో కష్టపడికష్టపడి ఆమె చేతి ఎముకలు విరిగిపోతాయి. ఈ బాధ చూడలేక తల్లి కోసం ఆసు యంత్రాన్ని కనుక్కోవాలనుకుంటాడు. ఇక అప్పటి నుంచి అదే సంకల్పంతో ముందుకు వెళ్తాడు. అనేక అవమానాలు హేళనలు ఎదురైనా వెనుదిరిగి చూడడు. ఈ క్రమంలోనే మల్లేశానికి, అతడి మామ కూతురు పద్మ(అనన్య)తో పెళ్లి జరుగుతుంది. ఆమె కూడా మల్లేశం పట్టుదలకు తోడవుతుంది. ఒకానొక దశలో భార్యభర్తల మధ్య గొడవలు జరిగి.. మల్లేశం ఆత్మహత్య కూడా చేసుకోవాలని అనుకుంటాడు. ఆఖరికి.. భార్యతో కలిసి పట్నం వస్తాడు. ఇక అక్కడి నుంచి మల్లేశం.. పయనం ఎటువైపు సాగిందన్నది మాత్రం తెరపైనే చూడాలి మరి.
ఎలా ఉందంటే..
టాలీవుడ్ సినిమాలు హద్దులు దాటి ప్రవర్తిస్తున్న ప్రతీసారి.. మల్లేశం లాంటి సినిమాలు వచ్చి.. ప్రేక్షకులకు ఊరటనిస్తున్నాయి. ఇంకా తెలుగు సినిమా.. తెలుగుదనంతో కళకళలాడుతుందన్న నమ్మకాన్ని నిలబెడుతుంది. ఇప్పుడు మల్లేశం సినిమా కూడా ప్రేక్షకులకు అదే అనుభూతిని కలిగించిందని చెప్పొచ్చు. ఆసు యంత్రాన్ని కనిపెట్టి.. చేనేత కార్మికుల జీవిత కష్టాలను తీర్చి.. పద్మశ్రీ అవార్డును అందుకున్న మల్లేశం లాంటి రియల్ హీరో జీవితాన్ని తెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు దర్శకుడు రాజ్ ఆర్.
ఎవరెలా చేశారంటే..
ఇక ఇందులో మల్లేశం పాత్రలో ప్రియదర్శి ఒదిగిపోయి.. సినిమాకు ప్రాణం పోశాడు. తెలంగాణ యాసలో ఆయన మాట్లాడడం.. ఆ యంత్రం కోసం ఆయన తాపత్రయం.. ఇలా.. తన నటనతో ప్రేక్షకుల మనసు గెల్చుకున్నాడు. మల్లేశం భార్య పద్మ పాత్రలో అనన్య న్యాయం చేసింది. తండ్రి పాత్రలో నటించిన చక్రపాణి, తల్లి పాత్రలో నటించిన ఝాన్సీ నటన సినిమాకు అదనపు బలం. ఇక కథకు అనుగుణంగా పాటలు, సంగీతం అందించాడు మార్క్ కె.రాబిన్. కౌండిల్యస కెమెరా వర్క్ సూపర్. ఇక పెద్దింటి అశోక్ కుమార్ డైలాగ్స్ సినిమాకు ప్రాణం పోశాయి.
చివరిగా… మల్లేశం.. స్ఫూర్తినిచ్చాడు