ప్రముఖ సినీ నటుడు, దర్శకుడు, రచయిత గిరీష్ కర్నాడ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నిన్న మృతి చెందిన సంగతి తెలిసిందే. గిరీష్ స్వతహాగా కన్నడ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తి అయినా ఆయనకు ఇటు సౌత్‌లో అన్ని భాషలతో పాటు అటు నార్త్‌లో బాలీవుడ్ ఇండస్ట్రీతోనూ పరిచయాలు ఉన్నాయి. సౌత్, నార్త్ అన్న తేడా లేకుండా ఆయన సినిమాలు చేశాడు.
రంగస్థల నటుడిగా కెరీర్ స్టార్ట్ చేసిన గిరీష్ ఆ తర్వాత బహుబాషా నటుడిగా ఎదిగాడు. ఆయన విలన్‌గా చేసిన పాత్రలు ఎప్పటకీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయి. ఇక ఆయన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఆసక్తికర అంశాలు దాగున్నాయి. గిరీష్ బాలీవుడ్‌లో పాతతరం స్టార్ హీరోయిన్ హేమమాలినిని వివాహం చేసుకోవాల్సిందట. హేమ 1970వ దశకంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో అత్యంత అందగత్తెగా పేరు సంపాదించుకుంది. స్టార్ హీరోలంతా కూడా ఆమె అభిమానులుగా మారిపోయారని చెబుతుంటారు.
అలాంటి టైంలో హేమమాలిని తల్లి తన కుమార్తెను గిరీష్ కర్నాడ్‌కు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించారట. గిరీష్ ప్రవర్తన హేమ తల్లిని ఎంతో ఆకట్టుకుందట. ఈ విషయమై ఆమె గిరీష్ కర్నాడ్‌ను కూడా అడిగారట. అప్పటికే హేమ ధర్మేంద్రను పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవ్వడంతో గిరీష్‌తో పెళ్లి ఆగిపోయింది. ఆ తర్వాత ఆమె ధర్మేంద్రను వివాహమాడారు. గతంలో గిరీష్ కూడా ఓ ఇంటర్వ్యూలో హేమమాలిని గురించి మాట్లాడారు. ఆమెని ఎంతో గౌరవిస్తానని చెప్పారు. ఆమె ఒక మంచి నటి అని, అయితే రాజ్యసభ సభ్యురాలిగా ఆమె విఫలమయ్యారని చెప్పారు.