విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘శివ’ తీసిన సమయంలో ఎలా ఉండేవాడో గాని టెక్నాలజీ వచ్చిన తర్వాత రోజుకో న్యూస్ తో వైరల్ గా అవుతున్నాడు. కొంత కాలం బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ కొన్ని హిట్, ఫ్లాప్ సినిమాలు తీశారు. ఆ మద్య టాలీవుడ్ లోకి మళ్లీ ఎంట్రీ ఇచ్చి ఇక్క పలు సినిమాలు తీశాడు. కానీ ఒక్కటి కూడా హిట్ కాలేదు. వర్మ తీసే సినిమాల్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందని అందరూ అంటారు.
ఇదే సమయంలో ఆయన సినిమా కోసం చేసే ప్రమోషన్ కూడా చాలా చిత్ర విచిత్రంగా ఉంటుంది. వర్మ గత కొంత కాలంగా దాదాపు 50 సినిమాలను ప్రకటిస్తే అందులో 20 మాత్రమే రిలీజ్ అయ్యాయి. గతంలో నయీమ్ పై సినిమాను తీస్తానన్న వర్మ మళ్లీ దాని ఊసే ఎత్తలేదు. వైఎస్ మరణంపై కూడా రెడ్డిగారు పోయారు అనే కథను తీస్తానని చెప్పాడు. తాజాగా లక్ష్మీస్ ఎన్టీఆర్ నిర్మించిన విషయం తెలిసిందే.
ఇప్పటివరకు వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కోసం చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. తాజాగా ఓ ప్రముఖ ఛానల్ కి వర్మ ఇంటర్వ్యూ ఇస్తూ..మరో రెండు బయోపిక్ లకు ప్లాన్ చేస్తున్నానని..వైఎస్సార్, కేసీఆర్ ల బయోపిక్ తీయడానికి సిద్దంగా ఉన్నానని అన్నారు. గతంలో రెడ్డిగారు పోయారు టైటిల్ తో ఓ సినిమా చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల ఆగిపోయానని..వైఎస్సార్ మరణం తర్వాత జరిగిన పరిణామాలపై ఖచ్చితంగా సినిమా తీస్తానని అన్నారు.