ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ కన్నుమూశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో దర్శకునిగా తన కెరీర్ ప్రారంభించి పలు చిత్రాలకు దర్శత్వం వహించారు. తెలుగులోనే కాక తమిళ, హిందీ, కన్నడ, మలయాళ చిత్రాలకూ దర్శకత్వం వహించాడు. కోడి రామకృష్ణ స్వస్థలం పాలకొల్లు. దాసరి నారాయణరావు తొలిచిత్రం తాత మనవడు చూశాకా రామకృష్ణ మనస్సులో దర్శకత్వ శాఖలో పనిచేస్తే ఈయన వద్దే పనిచేయాలన్న దృఢసంకల్పం ఏర్పడింది. అలా సినిమాలపై ఇష్టంతో దాసరి నారాయణ వద్ద శిశ్యరికం చేశారు.
పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశారు. కోడి రామకృష్ణకు దర్శకుడిగా తొలిచిత్రం “ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య”(1981). దర్శకుడిగా దాసరి నారాయణరావుని పరిచయంచేసిన నిర్మాత కె.రాఘవ ఆయన శిష్యుడైన కోడి రామకృష్ణకు కూడా అవకాశం ఇచ్చారు. ఇండస్ట్రీలో వందకు పైగా సినిమాలకు దర్శకత్వం వహించిన దర్శకునిగా ఆయన అరుదైన రికార్డు సాధించారు. తెలుగు సినిమా చరిత్రలో అలా వంద సినిమాలు తీసిన దర్శకులు కోడి రామకృష్ణ కాక దాసరి నారాయణరావు, కె.రాఘవేంద్రరావు, కె.ఎస్.ఆర్.దాస్లు మాత్రమే.
2016లో కన్నడ చిత్రం ‘నాగహారవు’ తర్వాత ఆయన మరో చిత్రానికి దర్శకత్వ వహించలేదు. గ్రాఫిక్ టెక్నాలజీతో సినిమా కూడా తనదైన శైలిలో తెరకెక్కించి ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన ఘనత ఆయన సొంతం. అమ్మోరు, దేవుళ్లు, దేవి, అరుంధతి సినిమాలు ఇప్పటికీ జనాలు ఆదరిస్తూనే ఉన్నారు. దర్శకుడిగానే కాకుండా నటుడిగానూ రాణించారు. కెరీర్ ఆరంభంలో పలు పాత్రలు పోషించారు. సినిమా ఇండస్ట్రీలో దాదాపు ముప్పై ఏళ్లుగా కెరీర్‌ని కొనసాగించారు. కోడీ రామకృష్ణ మృతికి టాలీవుడ్ ప్రముఖులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.