పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి ఫాంలో ఉన్నప్పుడు కొన్ని ప్రయోగాలు కూడా చేశాడు. తన క్రేజ్ తో తానేం చేసినా చెల్లిపోద్ది అనుకుని జానీ సినిమాతో కథ, స్క్రీన్ ప్లే, డైరక్షన్ చేసిన పవన్ కళ్యాణ్ ఆ సినిమా ఫలితంతో షాక్ తిన్నాడు. ఇక ఆ సినిమా తర్వాత మరో అద్భుతమైన కథతో సినిమా చేయాలని అనుకున్నాడు పవన్ కళ్యాణ్. ఆ సినిమానే సత్యాగ్రహి. శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ లో ఏ.ఎం రత్నం సత్యగ్రహి నిర్మించాలని అనుకున్నారు. ఇక సెట్స్ మీదకు వెళ్లడమే తరువాయి అనుకున్న టైంలో ఆ సినిమా ఆగిపోయింది.
సమాజంలోని సమస్యల మీద పవన్ ఆ కథ రాసుకున్నాడట. అయితే అది సినిమాగా చెప్పడం కన్నా రియల్ గా చేసి చూపించడమే కరెక్ట్ అని ఆ సినిమా ఆపేసినట్టు వెళ్లడించారు పవన్ కళ్యాణ్. జనసేన అధినేతగా ప్రస్తుతం యూఎస్ టూర్ లో ఉన్న పవన్ కళ్యాణ్ అక్కడ ఎన్నారైలతో మీటింగ్స్ జరుపుతున్నారు. సత్యాగ్రహి సినిమా పవన్ చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేది. ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ చేయడమే ఆలస్యం పోస్టర్స్ కూడా వచ్చేశాయి.
సమాజంలోని సమస్యలు సినిమాలో చూపిస్తే ప్రజలకు వాటి మీద ఓ అవగాహన వస్తుంది. ప్రస్తుతం తమిళ దర్శకులు శంకర్, మురుగదాస్ లాంటి వారు అలాంటి కథలతోనే సినిమాలు చేస్తున్నారు. మరి పవన్ ఎందుకు వెనుకడుగేశాడో తెలియదు కాని ఆ సినిమా హిట్ అయితే పవన్ డైరక్టర్ గా కూడా సూపర్ సక్సెస్ అయ్యే వాడని ఫ్యాన్స్ అంటున్నారు.