తెలంగాణాలో ఎన్నికల ఫలితాలు అందరూ ముందే ఊహించినా … మరీ ఈ స్థాయిలో టీఆర్ఎస్ హవా ఉంటుంది అని ఎవరూ… అనుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ ఓటమే లక్ష్యంగా… ఆ పార్టీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ప్రజాకూటమిగా ఏర్పడి సీట్లు సర్దుబాటు చేసుకుని మరీ ఎన్నికలకు వెళ్లాయి. ఆ సమయంలోనే ఏపీ , తెలంగాణల్లో అందరి దృష్టి ఒకే ఒక్క నియోజకవర్గం మీద బాగా ఫోకస్ అయ్యింది. అదే కూకట్ పల్లి. ఇక్కడే అందరి దృష్టి పడడానికి కారణం నందమూరి వారసురాలు సుహాసిని పోటీ చేయడమే.
తెలంగాణాలో ఏ నియోజకవర్గానికి రానంత ప్రచారం ఈ సీటుకు రావడానికి ప్రధాన కారణం ఆమె నందమూరి వారసురాలు కావడం ఒకటయితే… ఏపీ నాయకులతో సహా సినిమా వాళ్ళ మద్దతు కూడా ఆమెకు దక్కడం. నందమూరి హరికృష్ణ కూతురు సుహాసిని మొదటిసారి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగడంతో చర్చనీయాంశంగా మారింది. కానీ ఎవరూ ఊహించని విధంగా ఆమె ఓటమిపాలయ్యింది.
అయితే మొదటి నుంచి తన అక్క సుహాసిని మద్దతుగా… జూనియర్ ఎన్టీఆర్ ప్రచారంలో పాల్గొంటాడని ప్రచారం జరిగినా ఆయన బయటకి రాలేదు. ఇప్పుడు ఈ విషయంలో జూనియర్ అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే… టీడీపీ తరపున ప్రచారాల్లో పాల్గొనకుండా పరువు దక్కించుకున్నాడు అని. అయితే… ఇక్కడ బాలకృష్ణ బిజీగా ప్రచారాల్లో పాల్గొన్న సంగతి తెలిసిందే. తన డైలాగులతో పద్యాలతో హంగామా చేసినప్పటికీ ఓటర్లు మాత్రం అటువైపు మొగ్గుచూపలేదు.
అసలు చంద్రబాబు సుహాసినికీ టికెట్ ఇచ్చిందే నందమూరి బ్రదర్స్ కళ్యాణ్ రామ్ – జూనియర్ ఎన్టీఆర్ కోసమే అని అందరికీ తెలుసు. నందమూరి ఫ్యామిలిలో టికెట్ ఇస్తే తప్పనిసరిగా ప్రచారానికి ఈ బ్రదర్స్ వస్తారని… తద్వారా… ఏపీ తెలంగాణల్లో టీడీపీకి లాభం చేకురుద్ది అని బాబు భావించాడు. అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం ఈ విషయంలో చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించి పరువు దక్కించుకున్నాడు. ఒకవేళ నందమూరి బ్రదర్స్ ఎన్నికల ప్రచారానికి వచ్చినా… ఫలితం రాకపోతే కనుక ఆ అపవాదు ఈ బ్రదర్స్ ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో అయితే పడుండేది.