Gossipsరవితేజ " అమర్ అక్బర్ ఆంటోనీ " రివ్యూ & రేటింగ్

రవితేజ ” అమర్ అక్బర్ ఆంటోనీ ” రివ్యూ & రేటింగ్

చిత్రం: అమర్ అక్బర్ ఆంథోనీ
నటీనటులు: రవితేజ, ఇలియానా, సునీల్, సత్య, అభిమన్యు సింగ్ తదితరులు
సినిమాటోగ్రఫీ: వెంకట్ సి దిలీప్
మ్యూజిక్: థమన్
దర్శకత్వం: శ్రీను వైట్ల
నిర్మాత: మైత్రి మూవీ మేకర్స్

మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘అమర్ అక్బర్ ఆంథోనీ’పై ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో వీరి కాంబినేషన్‌లో సినిమా ఎలా ఉంటుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద హిట్‌గా నిలవడంతో ఈ సినిమా కూడా అదే తరహా హిట్ అందుకుంటుందని ఆశిస్తున్నారు. మరి ఫ్లాపులతో సతమతమవుతున్న శ్రీనువైట్లకు రవితేజ సక్సెస్ అందించాడో లేదో రివ్యూలో చూద్దాం.
2
కథ:
అమర్(రవితేజ), ఐశ్వర్య(ఇలియానా) చిన్నప్పుడే తల్లిదండ్రులను పోగొట్టుకుంటారు. వీరు డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్ అనే వ్యాధితో బాధపడుతుంటారు. తన తల్లిదండ్రుల చావుకు కారణమైన వారిని చంపుతుంటాడు అమర్. కట్ చేస్తే.. అమెరికాలోని వాటా తెలుగు అసోసియేషన్‌లో ఈవెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ఇలియానాను ప్రేమిస్తాడు అక్బర్. ఈ క్రమంలో వరుసగా హత్యలు చేస్తున్న హంతకుడిని పట్టుకునేందుకు అభిమన్యు సింగ్ పోలీస్ ఆఫీసర్‌గా ఎంట్రీ ఇస్తాడు. ఒక వ్యాధితో బాధపడుతున్న ఇలియానా డాక్టర్ ఆంథోనీ దగ్గర ట్రీట్‌మెంట్ కోసం వెళుతుంది. రవితేజకు ఉన్న వింత జబ్బు గురించి తెలుసుకుని షాక్ అవుతుంది. కట్ చేస్తే.. విలన్‌లను ఒక్కొక్కరిగా హత్య చేస్తుంటాడు రవితేజ. ఈ క్రమంలో హీరోహీరోయిన్ల తల్లిదండ్రులను హత్య చేసింది ఒకరే అని తెలిసి షాక్ అవుతారు. అమర్, ఐశ్వర్యల తల్లిదండ్రులను విలన్‌లు ఎందుకు చంపారు? అమర్, ఐశ్వర్య చిన్నప్పుడే స్నేహితులనే విషయం వారికి తెలుస్తుందా లేదా? ఇంతకీ రవితేజ ఒక్కడా లేక ముగ్గురా? అనే విషయాలు తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

విశ్లేషణ:
దర్శకుడు శ్రీను వైట్ల తన మార్క్ టోటల్ ఎంటర్‌టైనర్‌ను మరోసారి ‘అమర్ అక్బర్ ఆంథోనీ’ రూపంలో మనముందుకు తీసుకొచ్చాడు. తనకు బాగా కలిసొచ్చిన హీరో రవితేజతో ఎలాంటి సినిమా చేయాలో అలాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కాగా కథ విషయంలో శ్రీను వైట్ల ఇంకాస్త జాగ్రత్త తీసుకుని ఉంటే బాగుండేది. ఫస్ట్ హాప్ మొత్తం హీరో హీరోయిన్ల ఫ్లాష్‌బ్యాక్, వారి మధ్య ఉన్న కామన్ విషయం గురించి రివీల్ చేయడానికే సరిపోయింది. తన తల్లిదండ్రులను చంపిన విలన్లను అంతం చేసేందుకు రవితేజ ఎలాంటి ప్లాన్ వేస్తున్నాడు అనే అంశాలతో సినిమాపై ఆసక్తి పెంచాడు దర్శకుడు.

అయితే ఈ సినిమాలో కమెడియన్ సత్య కామెడీ ఒక లెవెల్‌లో ఉంటుందని డబ్బా కొట్టారు చిత్ర యూనిట్. కానీ అతడు అంత గొప్పగా నవ్వించలేకపోయాడు. తనకు ఉన్న జబ్బు గురించి తెలుసుకుని షాక్‌లో ఉండిపోతాడు రవితేజ. ఇక్కడ వచ్చే ఇంటర్వెల్ బ్యాంగ్ బాగుంది. అటు సెకండాఫ్‌ను పూర్తిగా రివెంజ్‌ డ్రామాగా మనకు చూపించాడు వైట్ల. సునీల్, వెన్నెల కిషోర్ వంటి చాలా మంది కమెడియన్లు ఉన్నా తన మార్క్ పూర్తి కామెడీని అందించలేకపోయాడు వైట్ల. అమర్, అక్బర్, ఆంథోనీ అనే మూడు పాత్రలతో ప్రేక్షకులను కాస్త కన్ఫ్యూజ్ చేశాడు దర్శకుడు.

ఇక ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్‌లో పెద్దగా పస లేకపోవడం ప్రేక్షకులను నిరాశకు గురిచేస్తుంది. పోనీ సినిమాలో మ్యూజిక్ ఏమైనా ఆకట్టుకుందా అంటే అది కూడా లేదు. థమన్ పరమ రొటీన్ వాయింపుడుతో విసుగెత్తించాడు. ఓవరాల్‌గా చూస్తే అమర్, అక్బర్, ఆంథోనీ అంటే ముగ్గురా లేక ఒక్కరా అనే ట్విస్ట్ తెలుసుకునేందుకు థియేటర్‌కు వెళ్లాల్సిందే అనే తరహాలో సినిమాను ప్రెజెంట్ చేశాడు వైట్ల.
1
నటీనటుల పర్ఫార్మెన్స్:
రవితేజ ఈ సినిమా మొత్తాన్ని ఒంటి చేత్తో లాక్కొచ్చాడు. మూడు పాత్రల్లో తనదైన మార్క్ కామెడీ యాక్టింగ్‌తో మరోసారి ప్రేక్షకులను మెప్పించాడు. ఈ సినిమాలో రవితేజ చాలా స్టైలిష్‌గా కనిపించాడు. ఇక చాలా రోజుల తరువాత గోవా బ్యూటీ ఇలియానా తెలుగులో నటించడంతో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అని ఆశించిన ప్రేక్షకులు ఫుల్ సాటిస్ఫై అవుతారు. కాస్త బొద్దుగా ఉన్నప్పటికీ ఇలియానా తన యాక్టింగ్‌తో మెప్పించింది. కమెడియన్లు చాలా మంది ఉన్నా పెద్దగా నవ్వించలేకపోయారు. మిగతా నటీనటులు తమ పాత్రల మేరకు బాగానే చేశారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శ్రీనువైట్ల వరుస ఫెయిల్యూర్‌లతో సతమతమవుతున్న తరుణంలో రవితేజతో సినిమా అనగానే ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. అయితే తనదైన మార్క్ కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించడంలో మాత్రం వెనుకబడిపోయాడు. తాను రాసుకున్న కథాకథనాలను ఏమాత్రం పసలేకుండా రొటీన్ రివెంజ్ డ్రామాగా చూపించాడు. సక్సెస్ కోసం శ్రీనువైట్ల మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. వెంకట్ సి దిలీప్ సినిమాటోగ్రఫీ బాగుంది. సినిమా మొత్తం చాలా అందంగా చూపించారు. థమన్ సంగీతం పర్వాలేదు. పాటలు పెద్దగా ఇంప్రెస్ చేయలేకపోయినా రీ-రికార్డింగ్ బాగుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ విలువలు బాగున్నాయి. సినిమా మొత్తం గ్రాండ్‌ లుక్‌లో చూపించారు.

చివరగా:
అమర్ అక్బర్ ఆంథోనీ – రవితేజ వన్ మ్యాన్ షో!

రేటింగ్:
3/5

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news