దానం నాగేందర్.. పరిచయం అక్కరలేని మాస్ లీడర్. గ్రేటర్ హైదరాబాద్ గుండెకాయ ఖైరతాబాద్ జనం మెచ్చిన నాయకుడు. ఏ పార్టీలో ఉన్నా తన వ్యక్తిగత ఇమేజ్‌తోనే ప్రత్యర్థులను మట్టికరించగల సత్తా ఉన్న నేత. ప్రజలే లోకంగా ముందుకు కదిలే దానం కోసం ఇప్పుడు నియోజవర్గ ప్రజలు జయగానం చేస్తున్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో అన్నివర్గాల ప్రజులు దానం గెలుపు కోసం ముందుకు వస్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ అందరికీ అందుబాటులో ఉంటూ కష్టసుఖాల్లో పాలుపంచుకునే నేతనే మనం గెలిపించుకోవాలని కోరుతున్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ చరిత్రలోనే ఇలాంటి అపూర్వసన్నివేశాలను గతంలో ఎన్నడూ చూడలేదని పలువురు సీనియర్ నాయకులు అంటున్నారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దానంకు వెల్లువెత్తుతున్న మద్దతుతో ప్రత్యర్థులు బెంబేలెత్తిపోతున్నారు.
దానం ఇంత భారీ స్థాయిలో మద్దతు రావడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. నిజానికి.. గ్రేటర్ హైదరాబాద్‌లో కాంగ్రెస్ పార్టీకి దానం నాగేందర్ పెద్దదిక్కుగా ఉన్నారు. పార్టీ కోసం అనేక కష్టనష్టాలను ఎదుర్కొన్నారు. ఒకానొక దశలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడిగా పార్టీని తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దారు. ఈ క్రమంలోనే 1999, 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి 2009లో ఖైరతాబాద్ నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్సార్ కేబినెట్‌లో కార్మికశాఖ మంత్రిగా పనిచేశారు. పీజేఆర్ అకాల మరణం తర్వాత ఖైరతాబాద్ మరొకరి వశం కాకుండా కాపాడిన నేత దానం నాగేందర్. పీజేఆర్ ఆశయాలతో ఖైరతాబాద్‌లో కదిలి.. కార్మికవర్గాల మనసు గెలుచుకున్నారు దానం. పీజేఆర్ కలల్ని నిజం చేస్తూ ఆయన అన్నివర్గాల ప్రజలకు చేరువయ్యారు. వారితో కలిసిపోయారు. కష్టసుఖాల్లో పాలుపంచుకున్నారు.
అయితే.. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోయాయి. కాంగ్రెస్ పార్టీలోనూ ఒకరమైన స్తబ్ధత ఏర్పడింది. గ్రేటర్‌లో పార్టీ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కాంగ్రెస్‌లో కొందరు పెద్దలు ఇష్టారీతిన వ్యవహరించడం.. పార్టీలో కష్టపడిన నేతలకు విలువ ఇవ్వకుండా వ్యవహరించడం.. ఇలాంటి పరిణామాలతో దానం నాగేందర్ తన మనసు మార్చుకున్నారు. ఇదే సమయంలో టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ పాలన జనరంజకంగా కొనసాగడం.. అన్నివర్గాల ప్రజలకు సంక్షేమ, అభివ`ద్ది ఫలాలు అందుతుండడం.. రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుండడం.. మొత్తంగా బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం వెళ్తుండడంతో తాను అందులో భాగస్వామ్యం కావడానికి ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇది నిజంగా గ్రేటర్ రాజకీయాల్లో సంచలనం స`ష్టించింది.
ఇక్కడ ఒక్క విషయం మాత్రం చెప్పుకోవాలి. ఒక నాయకుడు పార్టీ మారుతున్నాడంటే.. ఎవరు కూడా ఆపడానికి పెద్దగా ప్రయత్నం చేయరు. కానీ.. దానం నాగేందర్ పార్టీని వీడేందుకు సిద్ధపడగానే కాంగ్రెస్ పెద్దలందరూ రంగంలోకి దిగారు. ఆయనను ఆపేందుకు ప్రయత్నం చేశారు. కానీ.. ఎప్పుడు కూడా తాను నమ్మిన పని కోసం ఎంతవరకైనా వెళ్లే.. దానం గులాబీ గూటికి చేరుకున్నారు. ఇక్కడ కూడా ఆయనకు కేసీఆర్ అదే స్థాయిలో స్థానం కల్పించారు. ఈ ఎన్నికల్లో ఖైరతాబాద్ టికెట్ కేటాయించారు. ఇప్పుడు ఈ ఎన్నికల్లో దానం గెలుపు దిశగా దూసుకుపోతున్నారు. అందరినీ కలుపుకుని పోతున్న దానం నాగేందర్ ప్రచారానికి జనం బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ప్రజాకూటమి పేరుతో జనం ముందుకు వస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి దాసోజు శ్రవణ్‌కు డిపాజిట్ కూడా దక్కదనే టాక్ వినిపిస్తోంది.