అనేక వివాదాల నేపథ్యంలో నిత్యం వార్తల్లో ఉంటున్న మణికర్ణిక సినిమా ఫైనల్‌గా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. గాంధీ జయంతి సందర్భంగా తాజాగా ఈ చిత్ర టీజర్ బయటకు వదిలింది చిత్రయూనిట్. రెండు నిమిషాల నిడివితో విడుదలైన ఈ టీజర్‌లో.. కదనరంగంలో కంగనా కదంతొక్కిన తీరు ప్రేక్షకలోకాన్ని ఆకట్టుకుంటోంది.
‘రాణి లక్ష్మి భాయ్’ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతుంది. అయితే తాజాగా విడుదలైన ఈ చిత్రం టీజర్.. చిత్రం పై ఒక్కసారిగా అంచనాలను పెంచుతుంది. బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ బచ్చన్ వాయిస్ ఓవర్ తో మణికర్ణిక టీజర్ మొదలవుతుంది. టీజర్ లో ప్రధానంగా కంగనా రనౌత్ హైలెట్ అవ్వగా.. శంకర్-ఎహ్సాన్-లాయ్ అందించిన నేపధ్య సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఝాన్సీ రాణిగా కంగన రనౌత్ శౌర్యం, పరాక్రమం, రాజసం, వీరోచిత నటన టీజర్ లో హైలైట్ గా నిలుస్తున్నాయి. బ్రిటీష్ వారితో యుద్ధ సన్నివేశాలు, యుద్ధంలో ఝాన్సీ లక్ష్మీబాయి పోరాట దృశ్యాలు… కళ్లు చెదిరేలా ఉన్నాయి. 1850నాటి రాజ్యాలు.. రాజ్యంలోని ఆనాటి వైభవం, రాజరికాన్ని కళ్లకు కట్టాడు డైరెక్టర్ క్రిష్. విజువల్ ఎఫెక్ట్స్ హైలైట్ గా ఈ సినిమా రూపొందుతోంది.
జీ స్టూడియోస్, కమల్ జైన్ సంయుక్తంగా నిర్మిస్తున్న మణికర్ణిక సినిమాకు… బాహుబలి, భాగ్ మిల్కా భాగ్ సినిమా రచయితలు పనిచేశారు. జాగర్లమూడి క్రిష్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇంకో విశేషం ఏంటంటే… ఈ సినిమా దర్శకత్వ బాధ్యతలు ఇందులో ప్రధాన పాత్రలో నటిస్తున్న కంగనా రనౌత్ కూడా తీసుకున్నారు.