‘మీటూ ‘ ఉద్యమం రోజు రోజుకి మరింత పెద్దదవుతోంది. ఈ ఉద్యమం ద్వారా గతంలో వేధింపులకు గురయిన మహిళలంతా ఇప్పుడు ఈ ఉద్యమం ద్వారా తమకు ఎదురైనా చేదు అనుభవాలను బయటకి చెప్పుకుంటున్నారు. ఒక్క ఫిలిం ఇండ్రస్ట్రీ కి చెందిన వారే కాకుండా అన్ని రంగాల్లో వేధింపులకు గురయిన వారంతా ఈ ఉద్యమం బాట పట్టారు. ఇప్పుడు మెల్లిగా ప్రారంభం అయినా.. ఇది ముందు ముందు మరింత సంచలనం సృష్టించేవిధంగా కనిపిస్తోంది.
తాజాగా ఒక తమిళ దర్శకుడు తనను కారులో నిర్బంధించి అత్యాచారయత్నానికి పాల్పడ్డాడంటూ మహిళా దర్శకురాలు లీనా మణిమేఖలై ఆరోపించింది. పదమూడేళ్లకు ముందు ‘విరుంబుగిరేన్, ‘తిరుట్టుపయలే’ వంటి సినిమాలకు దర్శకత్వం వహించిన శశిగణేశన్ కారులో తనను లైంగికంగా వేధించాడంటూ ‘మీటూ’ ద్వారా తెలిపింది. 2005లో తాను కవయిత్రిగా, వాఖ్యాతగా ఉన్నప్పుడు దర్శకుడు శశిగణేశన్‌ను ఓ స్టూడియోలో ఇంటర్వ్యూ చేశానని, ఆ ఇంటర్వూ ముగిశాక తాను ఆటోలో తిరిగి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా ఆయన తన కారులో లిఫ్ట్ ఇచ్చాడని తెలిపింది.
ఆ సమయంలో తన ఒడిలో ఉన్న సెల్‌ఫోన్‌ను విసిరికొట్టి తన ఫ్లాటుకు రమ్మంటూ ముప్పావు గంటసేపు లైంగింక చేష్టలతో తనను విసిగించాడని పేర్కొంది. తన బ్యాగ్‌లో వున్న కత్తితో ఆయనను బెదరించి కారును తన ఇంటి వైపుకు నడపమని చెప్పగానే బెదరిపోయాడని, ఆ తర్వాత సెల్ ఫోన్‌ను తీసుకుని ఇంటికి చేరుకున్నానని లీనా మణిమేఖలై ఆ సంఘటను వివరించింది.
ఈ విషయాన్ని లీనా బయటపెట్టగానే దర్శకుడు శశిగణేశణ్ స్పందించారు. మీటూను అడ్డు పెట్టుకొని లీనా తనపై తప్పుడు ఆరోపణలు చేస్తుందని.. తాను గేయ రచయితగా పైకి రాలేకపోయానని.. తనను అసిస్టెంట్ డైరెక్టుగా చేర్చుకోవాలంటూ తనను వేధింపులకు గురి చేసినట్లుగా రివర్స్ ఆరోపణలు చేశారు. దీంతో.. వీరిద్దరి మధ్య ఆరోపణల పర్వం సాగుతోంది. ఈ వ్యవహారం తమిళ సినిమా ఇండ్రస్ట్రీలో కలకలం రేపుతోంది. ఇప్పటికే గాయని చిన్మయి వైరముత్తు మీద ఇటువంటి ఆరోపణలే చేసి కలకలం సృష్టించింది.