నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే కత్తి మహేశ్‌పై పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. హైదరాబాద్ నగర్ నుంచి ఆయనను బహిష్కరించారు. పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని నగరం బయట వదిలిపెట్టినట్లు తెలుస్తోంది. తమ అనుమతి లేనిదే.. నగరంలోకి రావద్దని సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశించినట్లు కూడా సమాచారం. అయితే కొద్దిరోజుల క్రితం కత్తి మహేశ్ రాముడిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై పలువురు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు అతన్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
అయితే.. ఈ విషయం చిలికిచిలికి గాలివానలా తయారైంది. ఇప్పుడు ఏకంగా.. కత్తి మహేశ్‌పై చర్యలు తీసుకోవాలంటూ.. ఆయన దేశద్రోహిగా ప్రకటించాలంటూ.. స్వామి పరిపూర్ణానంద డిమాండ్ చేస్తున్నారు. ఈమేరకు ఆయన ధర్మాగ్రహయాత్ర చేపడుతామని ఆయన హెచ్చరించారు. అయితే అప్రమత్తమైన పోలీసులు స్వామికి అనుమతి ఇచ్చేందుకు అనుమతి నిరాకరించారు. ఈ క్రమంలో పరిపూర్ణానందను హౌస్ అరెస్ట్ చేశారు. జుబ్లీహిల్స్‌లోని స్వామీజీ ఇంటి వద్ద భారీగా పోలీసులు మోహరించారు. శ్రీరాముడిపై కత్తిమహేష్ వ్యాఖ్యలకు నిరసనగా యాదాద్రి వరకు స్వామి పరిపూర్ణానంద ధర్మాగ్రహ యాత్ర చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ యాత్ర నేపథ్యంలో వేలమంది హిందువులు యాదాద్రికి తరలివస్తున్నారు. ఈ క్రమంలోనే పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ఇక ఇదే విషయంలో స్వామి పరిపూర్ణానంద చేపడుతున్న ధర్మాగ్రహయాత్రకు మద్దతు ఇవ్వాలని నటుడు నాగబాబు కూడా పిలుపునిచ్చారు. ఇలా పరిస్థితి చేయిదాటి పోతోందని భావించిన పోలీసులు దీనికంతటికీ కారణమైన కత్తి మహేశ్‌పై నగర బహిష్కరణ వేటు వేశారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉందని భావించిన పోలీసులు కత్తిని నగరం బయట వదిలేసి.. తమ అనుమతి లేదని మళ్లీ రావద్దని హెచ్చరించినట్లు సమాచారం. ఏదేమైనా.. ప్రతీ విషయంలో వేలుపెట్టి గెలికే కత్తికి తగిన పనిష్‌మెంట్ ఇచ్చారని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం ఆయన మద్దతుగా నిలుస్తున్నారు.