ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్, పద్మశ్రీ నేరెళ్ల వేణు మాధవ్ (85) ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వెంటిలేటర్ పై ఉండి చికిత్స పొందారు. 1932 డిసెంబర్ 23న మట్టేవాడలో జన్మించిన వేణుమాధవ్ 16 ఏళ్ల వయసులోనే తన కెరియర్ ప్రారంభించారు.
తెలుగు, తమిళ, ఉర్దూ, ఇంగ్లీష్ భాషలలో ఆయన మిమిక్రీ ప్రదర్శనలు సాగాయి. అప్పట్లోనే విదేశాలకు వెళ్లి ప్రదర్శనలు ఇచ్చి ఎంతో పేరు తెచ్చుకున్నారు వేణుమాధవ్. కళారంగానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఆయన పేరుతో పోస్టర్ స్టాంప్ కూడా రిలీజ్ చేసింది ప్రభుత్వం.
సిని తారలు, రాజకీయ నేతలను ఆయన అనుకరించే తీరు అద్భుతంగా ఉండేది. నేరెళ్ల వేణుమాధవ్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. 1972 నుండి 1978 వరకు ఎమ్మెల్సీగా కూడా ఆయన పనిచేశారు. 2001లో ఆయనకు పద్మశ్రీ పురస్కారం వరించింది. వేణు మాధవ్ మృతిపై సిని తారలు, ప్రముఖ రాజకీయ నేతలు తమ సంతాపం తెలియచేస్తున్నారు.