ఆ టీడీపీ అసంతృప్తులపై జగన్ కన్ను ..?

జగన్ కు తీరని కోరిక ఏదైనా ఉందా అంటే అది సీఎం కుర్చీ. దానికోసం 2009 నుంచి ఆయన ఎంతగానో కష్టపడుతున్నాడు. ఎండనక వాననకా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నాడు. ఎలాగైనా.. ఏమి చేసైనా ఆ పీఠం దక్కించుకోవాలన్నిది ఆయన ఎత్తుగడ. దీనికోసం ఎన్నో ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను చిత్తూ చెయ్యాలని జగన్ చూస్తున్నాడు. దీనిలో భాగంగానే..ఆయన ఇప్పుడు చంద్రబాబు సామాజిక‌ వర్గానికి చెందిన అసంతృప్తి నేత‌ల‌ను టార్గెట్ చేసుకున్నట్టు తెలుస్తోంది.

ఆ సామజిక వర్గం ఎక్కువగా ఉండే కృష్ణ, గుంటూరు జిల్లా నేతలపై జగన్ గురిపెట్టడమే కాకుండా… వారిని వైసీపీలోకి రావాల్సిందిగా కబురు పంపుతున్నాడట. ఈ ప్రక్రియ శరవేగంగా పూర్తిచెయ్యడమే కాకుండా
తన పాదయాత్ర ఆయా జిల్లాలకు చేరుకునే సమయంలో వీరిని త‌న‌ పార్టీలో చేర్చుకోవాలని జగన్ స్కెచ్ వేస్తున్నాడు.

మొదటి నుంచి టీడీపీకి వెన్ను దన్నుగా ఉంటున్న కమ్మ సామాజిక వర్గ నేతలు ఆ పార్టీ విజయంలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సీఎం చంద్ర‌బాబు కూడా త‌న సామాజికవ‌ర్గ నేత‌ల‌కు ప్రాధాన్యం ఇస్తూనే వ‌స్తున్నారు. అయితే ఇదే సామాజిక వర్గం నేత‌ల్లోని మ‌రోవ‌ర్గం మాత్రం ఆయ‌నపై ఆగ్ర‌హంతో ఉన్నారు. కేవలం కొంతమందికి మాత్రమే సీఎం ప్రాధాన్యం ఇస్తున్నారు తప్ప మమ్మల్ని పట్టించుకోవడంలేదు అనేది వారి వాదన. సరిగ్గా ఇలాంటి వారి కోసమే ఎదురు చూస్తున్న జగన్ వారిని ఎలాగైనా ఒప్పించి వైసీపీలోకి తీసుకు వచ్చి కొంతమేరకైనా అధికార పార్టీ హవాకు చెక్ పెట్టాలని భావిస్తున్నాడు.

వాస్తవంగా చూస్తే… టీడీపీ అధికారంలోకి వచ్చాక కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమందిని చంద్ర‌బాబు దూరం పెడుతున్నారనే అసంతృప్తి కొన్ని వర్గాల్లో పెరిగింది. పార్టీలోఆర్థికంగా బలంగా ఉన్న నేతలకే ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని, మిగిలిన‌ నాయకులను కానీ, కార్యకర్తలను కానీ సానుభూతిపరులను కానీ ఆయన దగ్గరకు రానీయడం లేదనే ఒక వర్గం నాయకులు చెప్తూ వస్తున్నారు. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టు మా కులపోడు సీఎంగా ఉన్నాసరే మాకు ఏమైనా ప్రయోజనం కలిగితేనే కదా అన్నట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇప్పటికే కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచలి రవి, మాజీ ఎంపీ, మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావులతో జగన్ మంతనాలు జరిపినట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన సాయిబాబా, మాజీ మంత్రి, ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాకినేని పెదరత్తయ్యలతో వైఎస్సార్ సీపీ నేత‌లు వైసీపీలోకి వెళ్లేందుకు నిశ్చయించుకున్నట్టు తెలుస్తోంది. అలాగే … అనంతపురంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌చౌదరి, కృష్ణా జిల్లాలో గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ మోహ‌న్ తో కూడా జగన్ మాట్లాడి వైసీపీలోకి వచ్చేట్టు ఒప్పించాడని సమాచారం. అలాగే టీడీపీలోకి గొట్టిపాటి రవికుమార్ రాకతో అసంతృప్తితో రగిలిపోతున్న ప్రకాశం జిల్లాకు చెందిన కీలక నేత కారణం బలరాం కూడా వైసీపీలోకి వెళ్లేందుకు మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది.

Leave a comment