జూనియర్ ఎన్టీఆర్ కెరీర్లో బ్లాక్ బ్లాస్టర్ హిట్ సినిమాగా నిలిచి మళ్లీ జూనియర్ ను సక్సెస్ ట్రాక్‌పై నిలబెట్టిన సినిమా టెంపర్. ఈ సినిమాకి వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో తారక్ నటన అద్భుతం. ఆ సినిమాలో ఆ పాత్రకి నిజంగా ఎన్టీఆర్ ప్రాణం పోసాడనే చెప్పాలి. పూరీ మార్క్ డైలాగులు ఎన్టీఆర్ ఇమేజ్ ని మరింత పెంచేసాయి.
ఆ సినిమా క్రేజ్ ని హిందీ లో కూడా మారుమోగించాలని బాలీవుడ్ నిర్మాతలు ఆ సినిమాకి రీమేక్ తీస్తున్నారు. తెలుగు టెంపర్ సినిమాలో తారక్ పోషించిన యంగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రని ప్రస్తుతం బాలీవుడ్ యంగ్ స్టార్ హీరోల్లో ఒకరైన రణ్వీర్ సింగ్ చేస్తున్నాడు.
ప్రస్తుతం టెంపర్ సినిమా బాలీవుడ్ లో తీస్తున్నారు. ఎన్టీఆర్ పాత్రను రణవీర్ సింగ్ చేస్తుండగా.. దర్శకత్వ బాధ్యతలను రోహిత్ శెట్టి తీసుకున్నాడు. దక్షిణాది సినిమాలను బాలీవుడ్ లో రీమేక్ చేయడంలో పేరుగాంచిన రోహిత్ శెట్టి “టెంపర్” సినిమాను ఎంపిక చేసుకుని, ఫస్ట్ లుక్ తో పాటు రిలీజ్ డేట్ ను కూడా ఎనౌన్సు చేసాడు. అయితే ‘ఫస్ట్ లుక్’ పోస్టర్ మాత్రం ‘టెంపర్’ స్థాయిలోలేదు.
అందులో తారక్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో కనిపిస్తే.. హిందీ రేమాక్స్లో మాత్రం రణవీర్ సింగ్ మాత్రం కామెడీ పోలీస్ గా కనిపిస్తున్నాడు. దీంతో తారక్ అభిమానులు రోహిత్ శెట్టిపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. టెంపర్ పాత్రలో సీరియస్ నెస్ తగ్గించి కామెడీ గా మార్చేస్తారేమో అని సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఆ హిందీ డైరెక్టర్ రోహిత్ శెట్టి మాస్ కామెడీ సినిమాలు తియ్యడంలో సిద్ధహస్తుడు. ఈ సినిమా గురించి పూర్తి విషయాలు తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.