ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన తెలుగు సినిమాలన్నీ బాక్సపీస్ వద్ద బొక్కబోర్లా పడ్డాయి. కానీ ఇదే టైంలో వచ్చిన డబ్బింగ్ సినిమాలు తమ హవా చూపించి మంచి టాక్ తెచ్చుకున్నాయి. దీంతో తెలుగు సినీ అభిమానులు కొంత నిరాశకు గురయ్యారు. ఈ నెల రెండో వారంలో ఒకటికి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. అందులో అచ్చ తెలుగు సినిమా ‘ఒక్కడు మిగిలాడు’ అడ్రస్ లేకుండా పోయింది. ఈ సినిమాకు కనీస స్థాయిలో కూడా ఓపెనింగ్స్ రాలేదు.
సందీప్ కిషన్ ద్విభాషా చిత్రం ‘కేరాఫ్ సూర్య’ పరిస్థితి కూడా అంతంతమాత్రమే. కానీ డబ్బింగ్ సినిమాల్లో ‘అదిరింది’కి అంచనాలకు మించి వసూళ్లు వచ్చాయి. విశాల్ సినిమా ‘డిటెక్టివ్’కు కూడా వసూళ్లు పర్వాలేదు. పోయిన వారమంతా ఈ సినిమాలే హవా సాగించాయి.
ఈ వారం కూడా ఇదే తరహాలో డబ్బింగ్ సినిమాల జోరు నడిచే పరిస్థితి కనిపిస్తోంది. ఈ వారం దాదాపు పది సినిమాల దాకా రిలీజవడం విశేషం. అందులో డబ్బింగ్ సినిమాలు ‘గృహం’, ‘ఖాకి’ కూడా ఉన్నాయి. ఈ రెండు సినిమాలకూ టాక్ బాగుంది. ఓపెనింగ్స్ కూడా బాగున్నాయి.
క్రిటిక్స్ కూడా ఈ రెండు సినిమాలకే ప్రయారిటీ ఇచ్చారు. రివ్యూలు ఇచ్చారు. వీటికే ఎక్కువ థియేటర్లు కూడా కేటాయించారు. ఈ వారం అరడజనుకు పైగా తెలుగు సినిమాలు రిలీజ్ కాగా..
వాటికి కనీస స్థాయిలో కూడా స్పందన కనిపించడం లేదు. ‘స్నేహమేరా జీవితం’.. ‘లండన్ బాబులు’ సినిమాలు కొంత మేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించగా.. వాటికి టాక్ అయితే ఏమీ గొప్పగా లేదు.
వసూళ్లూ అంతంతమాత్రమే. ఇక ‘ప్రేమతో కార్తీక్’.. ‘ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం’.. ‘లవర్స్ క్లబ్’ లాంటి సినిమాల గురించి అయితే అసలు మాట్లాడుకోవడమే వేస్ట్.