గోపీచంద్‌కు అదిరిపోయే షాక్‌…

పాపం హీరో గోపీచంద్‌కి ఈమధ్య ఏదీ కలిసి రావడం లేదు. లౌక్యంతో విజయం వరించిందని ఆనందించేలోగానే ‘సౌఖ్యం’ వచ్చి దానిని హరించేసింది. సైన్‌ చేసిన సినిమాలేమో ఆర్థిక ఇబ్బందుల్లో పడి రిలీజ్‌ కాలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఈ కోవలోనే మరో సినిమా కూడా విడుదల అవ్వకుండా ఆర్ధిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతోంది.

ఆక్సిజన్ సినిమా గుర్తుంది కదా అప్పుడెప్పుడో ఈ సినిమా స్టార్ట్ అయ్యింది.. కానీ ఇంతవరకు విడుదలకు నోచుకోవడం లేదు. మధ్యలో కొన్ని కారణాల వల్ల షూటింగే ఆపేయాల్సి వచ్చింది. చివరికి నిర్మాత ఎ.ఎం.రత్నం జోక్యం చేసుకోవడంతో ఈ చిత్రం చిత్రీకరణ ఈ ఏడాది వేసవిలో ముగిసింది. ఈ చిత్రం షూటింగ్ దాదాపు రెండేళ్లపాటు సాగింది. సరే.. ఏదో కిందామీదాపడి చిత్రంబృందం షూటింగ్ కంప్లీట్ చేసేసింది కదా.. ఇక త్వరలోనే ప్రేక్షకుల ముందుకొస్తుందనుకుంటే అదీ లేదు. వరుసగా వాయిదాల మీద వాయిదా పడుతూనే ఉంది. ఆర్థిక సమస్యల కారణాల వల్లే ఈ చిత్రం విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చింది.

అయితే ఆర్ధిక పరిస్థితులు కొద్దిగా అనుకూలించడంతో గతనెలలో గ్రాండ్‌గా ఆడియో వేడుక నిర్వహించి, అక్టోబర్ 27వ రిలీజ్ చేయనున్నట్లు యూనిట్ వెల్లడించింది.అంతలోనే ఏమయ్యిందో ఏమో కానీ మళ్ళీ నవంబర్ 10కి వాయిదా వేసేశారు. మళ్ళీ 17కి పోస్ట్‌పోన్ చేసేశారు. ఇప్పుడు ఆరోజు కూడా ఈ చిత్రం విడుదలయ్యే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదు. వాస్తవానికి.. రిలీజ్ డేట్ దగ్గరపడేకొద్దీ యూనిట్ ప్రచారకార్యక్రమాల్ని విస్తృతం చేస్తుంది. తామే స్వయంగా రంగంలోకి దిగడంతోపాటు హీరో, హీరోయిన్లతో ప్రమోషన్ కార్యక్రమాలు చేయిస్తుంది. కానీ.. ఈ చిత్రబృందం అలా చేయడం లేదు. 17వ తేదీ రిలీజ్ డేట్ ప్రకటించి సైలెంట్ అయిపోయిందే తప్ప.. ఆ తర్వాత ఎలాంటి అప్‌డేట్ ఇవ్వకుండా సైలెంట్ అయిపోయింది. దర్శకనిర్మాతలు కానీ, హీరోకానీ ఎవ్వరూ ఈ చిత్రాన్ని పట్టించుకోవడం లేదు. దీంతో 17వ తేదీ ఈ చిత్రం రిలీజ్ కావడం లేదని ఓ క్లారిటీ వచ్చేసింది.

అన్ని సమస్యలు సమసిపోయాయని స్వయంగా యూనిట్టే వెల్లడించింది కదా.. మళ్ళీ ఈ వాయిదాల పర్వం ఏంటని ఆరాతీస్తే.. ఇంకా ఆ ప్రాబ్లమ్స్ కొలిక్కి రాలేదని తెలిసింది. ఫైనాన్స్ సమస్యల వల్లే ఈ చిత్రం విడుదలకు మోక్షం కలగట్లేదని స్పష్టమైంది. మరోవైపు.. ఈ మూవీ రైట్స్ కొనుగోలు చేయడానికి ఏ డిస్ట్రిబ్యూటర్ కూడా ముందుకు రావడం లేదట. ఆల్రెడీ ఆర్థిక సమస్యలతో నిర్మాత సతమతమవుతుంటే.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ కూడా ముందుకు రాకపోవడంతో ఏం చేయాలో తోచక రిలీజ్‌ని ఆపేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు పరిస్థితి చూస్తే చివరి నిమిషం వరకు బొమ్మ పడేది లేనిదీ అనుమానం అంటున్నారు.

Leave a comment