నాని ని చూస్తే హీరోలా కనిపించడు.. మన పక్కింటి కుర్రాడిలాగానే కనిపిస్తాడు. తన సహజమైన నటనతో అందరిని ఆకట్టుకుంటూ మంచి పేరు సంపాదించుకున్న ఈ యంగ్ హీరో, ఇటీవల కాస్త సినిమాల్లో వెనుకబడినట్టు కనిపించినప్పటికీ మళ్ళీ మంచి కధాంశాలతో రేసులోకి వచ్చి దూసుకుపోతున్నాడు.
ఈ సంవత్సరం నాని నటించిన మూడు సినిమాలు వరుస విజయాలు సాధించాయి. ప్రస్తుతం వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’ సినిమాలో నాని నటించారు. ఈ సినిమా టీజర్, సాంగ్‌కి మంచి స్పందన వచ్చింది. దీంతో ‘ఎంసీఎ’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే పెరిగిపోయాయి. ఈ హీరో ఎక్కువగా ప్రేమ కధలను ఎంపిక చేసుకుని ఆ సినిమాల్లో నటిస్తూ మంచి విజయం సాధిస్తున్నాడు.
అయితే ఈ కుర్ర హీరోకి ఇటీవల ఓ పెద్ద చిక్కు వచ్చి పడింది. అదేంటంటే.. మిడిల్ క్లాస్ అబ్బాయి సినిమాను
క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 23న రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే అదే టైంలో టాలీవుడ్ లో ఇద్దరు ప్రముఖుల వారసుల సినిమాలు రిలీజ్ చేయబోతున్నారు. దీంతో నాని సినిమాను ముందుకు జరిపించే ప్రయత్నాలు వారు ప్రయత్నిస్తున్నట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి.
వాస్తవానికి డిసెంబర్ మూడో వారంలో సినిమాను రిలీజ్ చేస్తే సెలవులను టార్గెట్‌గా చేసుకుని మంచి కలెక్షన్ లు సాధించవచ్చని ఆ సినిమా యూనిట్ ప్లాన్ చేసింది. అయితే అదే సమయంలో అక్కినేని వారసుడు అఖిల్ రెండో సినిమా హలో కూడా వస్తోంది. నాగార్జున నిర్మాతగా విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 23న రిలీజ్ చేస్తున్నారు.
డిసెంబర్ 24న అల్లు అరవింద్ తనయుడు అల్లు శిరీష్ హీరోగా తెరకెక్కిన ఒక్క క్షణం సినిమాను రిలీజ్ చేస్తున్నారు. వీరిద్దరు ఎక్కువ థియేటర్లు బుక్ చేసుకోవడంతో పాటు దిల్ రాజును ఒప్పించి నాని ఏంసీఏ సినిమాను వారం తరువాత రిలీజ్ చేయించాలని వారు ప్లాన్ వేసుకున్నారట. దీంతో నాని సినిమా మీద ఆ ప్రభావం కనిపించబోతోంది. పాపం నాని సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి.