కోలీవుడ్ స్టార్ హీరోలు రజనీ, కమల్ ఎప్పటి నుంచో మంచి మిత్రులు. ఇప్పుడు ఈ ఇద్దరు మిత్రులు కూడా రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నారు. త్వరలోనే వేరు వేరు రాజకీయ పార్టీలు పెట్టబోతున్నారు. ఇప్పటికే కమల్ హాసన్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేశాడు. రజనీ ఎంట్రీ ఇచ్చేందుకు ముహూర్తం పెట్టేశాడు. అంటే ఈ ఇద్దరు మిత్రులు భవిష్యత్ లో పొలిటికల్ గా శత్రువులుగా మారే అవకాశం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి సినిమాలు ఒకేసారి బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిని, ఆందోళనను కలిగిస్తోంది. కోలీవుడ్ సూపర్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ బాక్సాఫీస్ యుద్ధానికి రెడీ అవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన రజనీకాంత్ రోబో 2.0 వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ అనుకోని కొన్ని కారణాల వల్ల రోబో 2.0 ఏప్రిల్ నెలకి వాయిదా పడుతుందని తెలుస్తోంది.
గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమా ఎంత సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో వస్తోన్న రోబో 2.0 ఇండియన్ సినిమా హిస్టరీలోనే భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా సౌత్ ఇండియా అంతా ఒకేసారి థియేటర్లలోకి దిగుతోంది. ఇక అదే నెలలో కమల్ హాసన్ విశ్వరూపం 2 రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయి. దీంతో అప్పటికి పొలిటికల్ వార్, సినిమా వార్ రెండూ కలసి పెద్ద సంచలనమే సృష్టించవచ్చని సినీ, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.