వివాదాల దర్శకుడు సినిమాను తీసేది తక్కువ దాన్ని పబ్లిసిటీ చేసేందుకు వివాదాలను సృష్టించడం ఎక్కువ. అందుకే ఇటీవల వర్మ చేసిన ఏ ఒక్క సినిమా కూడా సక్సెస్ కాలేదు. దాదాపు దశాబ్ద కాలంగా వర్మ చేస్తూ వస్తున్న ఏ ఒక్క సినిమా కూడా తెలుగు ప్రేక్షకులను అలరించలేక పోయాయి. ఇటీవల వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్న వర్మ సినిమాల సంఖ్య కాస్త తగ్గించాడు.
నాగార్జునతో శివ సినిమా చేసి సంచలనాలు సృష్టించిన వర్మ చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ నాగార్జునతో సినిమా చేసేందుకు కమిట్ అయ్యాడు. వర్మతో సినిమాకు కమిట్ అయిన సమయంలో నాగార్జునను పలువురు హెచ్చరించడం జరిగిందట. వర్మతో సినిమా చేయడం మంచి నిర్ణయం కాదని, ఈ సమయంలో సాహస నిర్ణయంను నాగార్జున తీసుకున్నాడు అంటూ కొందరు సినీ వర్గాల వారు బాహాటంగానే అంటూ ఉన్నారు. అయితే నాగార్జున మాత్రం ఫుల్ ప్లాన్డ్‌గానే ఈ ప్రాజెక్ట్‌ను ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది.
సినిమాకు సంబంధించి హడావుడి ఎక్కువ చేయవద్దని, పూర్తి దృష్టి సినిమాపైనే పెట్టాలని, మొదటే స్క్రిప్ట్‌ను పూర్తి చేసి, ఆ తర్వాత మార్పులు ఏమీ చేయవద్దని, ఇక తనతో చేస్తున్న సినిమా పూర్తి అయ్యే వరకు మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచించవద్దని వర్మ వద్ద నాగార్జున మాట తీసుకుని మరీ ఈ చిత్రాన్ని చేసేందుకు కమిట్ అయ్యాడు. నాగార్జున హెచ్చరిక నేపథ్యంలో వర్మ ఈ సినిమాను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించబోతున్నాడు.