దర్శకత్వం : వివేక్ ఆత్రేయ
సంగీతం : ప్రశాంత్ ఆర్ విహారి
నిర్మాత : రాజ్ కందుకూరి
నటీనటులు : శ్రీ విష్ణు, నివేత పేతురాజ్, అమృత
‘పెళ్లి చూపులు’ సినిమాతో కొత్తవారిని పరిచయం చేసి 2016లో చిన్న చిత్రంగా విడుదలై పెద్ద విజయాన్ని అందుకున్న నిర్మాత రాజ్ కందుకూరి నిర్మించిన తాజా సినిమా ‘మెంటల్ మదిలో’. శ్రీ విష్ణు, నివేత పెతురాజ్, అమృత హీరో హీరోయిన్స్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ‘మెంటల్ మదిలో’ సినిమా ఈ శుక్రవారం పేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూ లో చూద్దాం.
కథ:
అరవింద్ కృష్ణ (శ్రీ విష్ణు) చిన్నప్పటినుండి కన్ఫ్యూషన్ తో పెరుగుతాడు. రెండు ఆప్షన్స్ ఉంటే అందులో ఒకటి సెలెక్ట్ చేసుకోవడంలో సతమతమయ్యే అరవింద్ కు స్వేచ్ఛ (నివేత పెతురాజ్)కు పెళ్లి చేయాలనీ నిర్ణయించుకుంటారు పెద్దలు. దీంతో అరవింద్, స్వేచ్ఛ ఒకరినొకరు ప్రేమించుకుంటారు.
అలాంటి టైంలోనే పని మీద అరవింద్ ఢిల్లీ వెళ్తాడు. అక్కడ రేణు(అమృత) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కూడా అతన్ని ప్రేమిస్తుంది. ఇలా స్వేచ్ఛ, రేణు ఇద్దర్ని ప్రేమించిన అరవింద్ చివరికి ఎవర్ని ఎంచుకున్నాడు, అతని కన్ఫ్యూజన్ ఎలా దూరమైంది అనే విషయాలు తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ప్లస్ పాయింట్స్:
శ్రీవిష్ణు చాలా బాగా నటించారు. ఆయన నిజ జీవితంలో ఎలా ఉంటారో తెరమీద కూడా దాదాపు అలాగే కనిపించారు. నివేదా తొలి సినిమాతోనే ఆకట్టుకుంది. ఆమె ఇందులో ఎక్కడా నటించినట్టు కనిపించదు.. మామూలు మిడిల్ క్లాస్ అమ్మాయిలాగానే ఉంటుంది. ఆమె తీరు, ప్రవర్తన, చేసుకోబోయే వ్యక్తి మీద ఆమెకున్న అనురాగం.. ప్రతి విషయంలోనూ చాలా సహజత్వాన్ని కనబరిచింది. ఒకప్పటి సినిమాల్లో జయసుధను తలపించిందంటే తప్పు కాదేమో. చేసుకోవాలనుకున్న వ్యక్తి కళ్లముందు కన్నుమూస్తే ఆ బాధను తట్టుకోవడానికి ప్రయత్నం చేసే అమ్మాయిగా రేణు పాత్రలో అమృత మెప్పించింది. `మనిద్దరి మధ్య అనుబంధం చాలా డిఫరెంట్. నువ్వు థాంక్స్ చెబితే నేనూ థాంక్స్ చెప్పాలి. నువ్వు సారీ చెబితే నేనూ సారీ చెప్పాలి. ప్లీజ్ వద్దు` అని రేణు చెప్పే డైలాగు.. ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. ఒక జంట మధ్య జరిగే తప్పొప్పులకు ఇద్దరూ బాధ్యులే అనే విషయాన్ని దర్శకుడు చాలా హుందాగా, వివరంగా అదే సమయంలో సున్నితంగా, సూక్ష్మంగానూ చెప్పారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా సన్నివేశాలు మెప్పిస్తాయి. పాత్రలన్నీ మన కళ్ల ముందు తిరుగుతున్నట్టే ఉంటాయి. ఎక్కడా హంగూ, ఆర్భాటాలూ కనిపించవు. సాదాసీదాగా జరుగుతున్నట్టు ఉంటుంది. అదే సమయంలో తెరమీద క్వాలిటీ ఎక్కడా తగ్గలేదు. ప్రతి విభాగమూ తమ తమ పనులను బాధ్యతాయుతంగా నిర్వర్తించిందనే చెప్పాలి.
మైనస్ పాయింట్స్:
సినిమాలో సెకండాఫ్ స్టార్టింగ్ టేకాఫ్ కాసింత ఒడుదొడుకులకు లోనైనట్టు అనిపిస్తుంది. అంతకు మించి సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యే మైనస్ పాయింట్లు ఏమీ కనిపించవు.
సాంకేతిక విభాగం:
నూతన దర్శకుడు అయిన వివేక్ ఆత్రేయ ఎంచుకున్న పాయింట్ బాగుంది. ఫస్టాఫ్ ను చాలా బాగా నడిపిన ఆయన సెకండాఫ్ ను కూడా ఇంకాస్త బెటర్ గా నడిపి ఉంటే సినిమా ఫలితం ఇంకాస్త బెటర్ గా ఉండేది. ప్రశాంత్ ఆర్ విహారి పాటలకు అందించిన సంగీతంతో పాటు నేపధ్య సంగీతం కూడా బాగుంది.
వేదరామన్ కెమెరా పనితనం బాగుంది. సినిమా మొదటిసగం ఎక్కువగా ఇంట్లో చిత్రీకరించారు, ఆ సన్నివేశాల్లో లైటింగ్, ఫ్రేమింగ్ బాగా కుదిరి సన్నివేశాలు చూడ్డానికి అందంగా ఉన్నాయి. విప్లవ్ ఎడిటింగ్ పర్వాలేదు. నిర్మాత రాజ్ కందుకూరి పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి.
విశ్లేషణ:
మొత్తం మీద ఈ ‘మెంటల్ మదిలో’ చిత్రం ఆహ్లాదకరమైన రొమాంటిక్ ఎంటర్టైనర్ అని చెప్పొచ్చు. మంచి రొమాన్స్, ఆకట్టుకునే నటీ నటుల నటన, లైటర్ వేలో ఉండే ఫ్యామిలీ ఎమోషన్స్, ఫన్, డైలాగులు అన్నీ కలిసి సినిమాను ప్రేక్షకులకు కనెక్టయ్యేలా చేస్తాయి. సినిమా లైన్ సాధారణమైనదే అయినా అందులోని శ్రీవిష్ణు పాత్ర సినిమా చివరి వరకు ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమా మల్టీ ప్లెక్స్ ప్రేక్షకులను, యువతను బాగా ఆకట్టుకోవడమేగాక వారాంతంలో మంచి సినిమాను చూసిన అనుభూతిని కలిగిస్తుంది. కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఈ సినిమాను చూడొచ్చు.
Telugu lives.com Rating : 3 /5