‘ఓటర్’ అంటే ఆషామాషీ వ్యక్తి కాదు, మీ అంతుతేల్చే నిఖార్సైనవాడు అని మంచివిష్ణు వేలెత్తి మరీ కోపంగా తేల్చి చెప్తున్నాడు. ఓటర్ అనగానే.. ఒక మందు బాటిల్, రూ.500కి కక్కుర్తి పడే వ్యక్తి అనే ముద్ర రాజకీయ వర్గాల్లో ఉంది. వాటితో వలవేస్తే అందులో చిక్కుకునేవాడే ‘ఓటర్’ అనే భావన పొలిటీషియన్లలో ఉంది. కానీ ఇది తప్పు అని వేలెత్తి మరీ చూపిస్తున్నాడు మంచు విష్ణు.
‘అడ్డా’ ఫేం కార్తీక్ రెడ్డి డైరెక్షన్‌లో ‘ఓటర్’ అనే సినిమా చేస్తున్నాడు విష్ణు. కొంతకాలం క్రితం ఈ చిత్రానికి సంబంధించి ఓ ప్రకటన వచ్చినప్పుడు ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ ఇప్పుడు రిలీజైన ‘ఫస్ట్‌లుక్’తో మాత్రం విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకుంటోంది. విష్ణు పుట్టిన రోజుని పురస్కరించుకుని యూనిట్ రిలీజ్ చేసిన ఈ పోస్టర్‌లో తన చూపుడు వేలికి అంటిన సిరా చిక్కను కోపంగా చూపిస్తూ, రాజకీయ నేతలకు సవాల్ విసురుతున్నట్లుగా ‘ఇదీ ఓటర్ పవర్’ అన్నట్లు హీరో చాలా కోపంగా, కసిగా కనిపించాడు.
మొత్తానికి ఈ పోస్టర్.. పిచ్చెక్కించేసేలా ఉంది. ఇక ఈ పోస్టర్‌లాగే సినిమా కాన్సెప్ట్ కూడా మరింత అద్భుతంగా ఉందని, చాలా ఇంట్రెస్టింగ్ నరేషన్‌తో కథ సాగుతుందని తెలిసింది. సిస్టమ్ మీద ఒక కామన్ మ్యాన్ సాగించే పోరాటం నేపథ్యంలో ఈ చిత్రం రూపొందుతోంది. సాధారణంగా విష్ణు సినిమాల్లో పొలిటికల్ పంచ్ లు ఎక్కువగా ఉంటాయి. ఇందులో అంతకుమించే ఉంటాయని ఈ పోస్టర్ ద్వారా చెప్పకనే చెప్పేశారు. ఇకపోతే ఈ సినిమాను ఒకేసారి తెలుగు, తమిళంలో రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాతో అయినా మంచు విష్ణు ఖాతాలో హిట్ పడే అవకాశం ఉందొ లేదో చూడాలి.