తమిళ నాట మరో కొత్త సమస్య వచ్చి పడింది.అక్కడి ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వినోదపు పన్ను కారణంగా ఏడు సినిమాలు కనీసం విడుదలకు నోచుకోక ల్యాబుల్లో ముక్కీమూలుగుతున్నాయి.విడుదల కాని వాటిలో ‘ఉదిరికొల్’, ‘కడైసీ బెంచ్ కార్తి’, కళత్తూరు గ్రామం’, తిట్టివాసల్’, ఉప్పు పులి మిలగాయ్’, ‘అళగిన్ బొమ్మి’, ‘విళిత్తిరు’ వంటి చిత్రాలు ఉన్నాయి.కొన్ని సినిమాలు వినోదపు పన్నుకారణంగా పలుమార్లు విడుదల తేదీలను మార్చుకుంటున్నాయి.ఈ విషయంలో బాలీవుడ్ సినీ సంఘాలు, తెలుగు నిర్మాతల మండలి కూడా సంఘీభావం ప్రకటించాయి.
ఎప్పటికీ ప్రభుత్వం దిగి రాని కారణంగా వినోదపు పన్నుకు వ్యతిరేకంగా సమ్మె ప్రారంభమైంది. దీని ప్రభావం ఈ దీపావళిపై పడడం ఖాయం. నిర్మాతల మండలి నిర్ణయంపై కూడా ఆయా చిత్రాల నిర్మాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉన్నట్లుండి తీసుకున్న నిర్ణయంతో తాము అప్పులు చేసి నిర్మించిన సినిమాను విడుదల చేయలేకపోతున్నామని వాపోతున్నారు.
ఈ విషయమై దర్శక నిర్మాత మీరా కదిరవన్ నిర్మాతల మండలికి వచ్చి కన్నీళ్లు పెట్టుకున్నట్లు సమాచారం. మరోవైపు దీపావళి నేపథ్యంలో ‘మెర్సల్’ చిత్రం భారీ స్థాయిలో అమ్ముడైంది. ఒకవేళ దీపావళికి తెరపైకి రాకపోతే.. పంపిణీదారులు, థియేటర్ యజమానులు తీవ్రంగా నష్టపోయే అవకాశముందని సినీ వర్గాలు చెబుతున్నాయి.