రుద్రమ్మ రీరిలీజ్ : చారిత్రక చిత్రం రుద్రమ దేవి అనేకానేక ఆటుపోట్లు దాటుకుని రెండేళ్ల కిందట విడుదలైన సంగతి తెలిసిందే! మళ్లీ ఇప్పుడేంటీ విడుదల అని ఆశ్చర్యపోతున్నారా.. అదేం లేదు ఈ సినిమా త్వరలో బుల్లితెరపై ప్రసారం కానుంది. అనుకున్నంతగా శాటిలైట్ ధరకు కూడా అమ్ముడుపోని రుద్రమదేవి ఫైనల్ గా ఈ నెల 15న ఈటీవీ ఛానెల్ లో ప్రసారం కానుంది.భారీ అంచనాలతో 2015 అక్టోబర్ 9న రిలీజ్ అయ్యింది.
సినిమాను ఎక్కువ థియేటర్స్ లో రిలీజ్ చేయడం వలన.. అలాగే అల్లు అర్జున్ పాత్ర ఆకట్టుకోవడం వలన.. కేవలం నష్టాల నుండి తప్పించుకోగలిగింది కానీ పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందన్నది నిజం. సృజనాత్మక స్వేచ్ఛ (క్రియెటివ్ ఫ్రీడమ్) పేరిట గుణశేఖర్ చారిత్రక కథని తనకు అనుగుణంగా మలిచి తీసినప్పటికీ ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది. అటుపై ఆయన రుద్రమ్మకు సీక్వెల్ రూపొందిస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. అవి కూడా వాస్తవ రూపం దాల్చలేదు.వినోదపు పన్ను మినహాయింపుని తెలంగాణలో పొందినప్పటికీ ఆంధ్రప్రదేశ్ సర్కార్ మాత్రం అందుకు సమ్మతించలేదు.
దీంతో ఏపీ సర్కార్ కి గుణశేఖర్ ఓ లేఖ రాశారు. గౌతమీ పుత్ర శాత కర్ణి సమయంలోనే తమ సినిమాకు టిక్కెట్ రూపంలో వచ్చిన వినోదపు పన్నును ప్రోత్సాహక రాయితీ కింద తిరిగి చెల్లించాలని సీఎం చంద్రబాబుని అప్పట్లో కోరారు. కానీ తదనంతరం ఏమైందో కానీ గుణశేఖర్ ప్రయత్నాలు పెద్దగా ఫలించలేదు.ఏదేమైనప్పటికీ మరోమారు ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను పలకరించడం గుణశేఖర్‌కు ఒకింత ఊరట! ఇక టీఆర్పీ రేటింగ్స్ , యాడ్ రెవెన్యూ ఇలా అన్నీ అన్నీ బాగుంటే పునః ప్రసారానికి నోచుకునే అవకాశాలు మెండు.