లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని రామ్ గోపాల్ వర్మ ఏ ముహూర్తాన అనౌన్స్ చేశాడో కానీ అన్నీ వివాదాలే!! తాజాగా ఒకనాటి అందాల తార, సీనియర్ ఎన్టీఆర్ సరసన సామ్రాట్ అశోక సినిమాలో నటించిన వాణీ విశ్వనాథ్ ఘాటుగా స్పందించింది.‘‘తెలుగు ప్రేక్షకులను ‘మీకు దేవుడులాంటి నటుడు ఎవరు’ అని అడిగితే కళ్లు మూసుకుని అందరూ చెప్పే పేరు ఎన్.టి.రామారావు.
తెలుగు ప్రజల మనసులో ఆయన ఓ రాముడిగా, కృష్ణుడిగా ముద్రవేసుకున్నారు. ఆయన జీవితం గురించి బాలకృష్ణ ఓ చిత్రాన్ని తీస్తున్నారు. అది గొప్పగా ఉంటుందని చెప్పొచ్చు. ఎందుకంటే తండ్రి కాబట్టి ఎన్టీఆర్‌ను దేవుడిలాగానే చూపిస్తారు. కానీ, రామ్‌గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’పై అనుమానాలున్నాయి. రాముడి సినిమా తీస్తూ.. రావణ అని, కృష్ణుడి సినిమా తీస్తూ.. కంస అని, గాంధీ సినిమా తీస్తూ.. గాడ్సే అని పేరు పెట్టలేరు కదా. అందుకే ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కించే ప్రయత్నాన్ని వర్మ వెంటనే విరమించుకోవాలి.
ఎన్టీఆర్‌కు కళంకం తెచ్చేలా సినిమా తీస్తే ఆయన ఇంటి ముందు ధర్నాకు దిగుతా. వర్మ తీసే సినిమా పేరులోనే వ్యాపారం, వివాదం దాగి ఉంది. ఎన్టీఆర్ నటించిన ‘సామ్రాట్ అశోక్’ చిత్రంలో కథానాయికగా నేను నటించా. ఓ వీరాభిమానిగా చెబుతున్నా. వర్మ సినిమా తెరకెక్కించే ప్రయత్నాన్ని వెంటనే విరమించుకోవడం ఉత్తమం’ అని అన్నారు.