ఒక వివాదం అనేకానేక మలుపులు తిరుగుతోంది రాజకీయ రంగు మరింతగా పులుముకుంటోంది.
దేశవ్యాప్తంగా అమలవుతున్న జీఎస్టీపై తమిళ్ మూవీ మెర్శల్ చేసిన వ్యాఖ్యే ఇందుకు కారణం ఇప్పుడీ రగడ టాలీవుడ్ కి పాకింది. మంచు విష్ణు తాజా వివాదంపై స్పందించారు.
సినీనటులకు జీకే ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు చేసిన వ్యాఖ్యలపై నటుడు మంచు విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమిళ నటుడు విజయ్ నటించిన ‘మెర్సల్’ చిత్రంలో వస్తు, సేవల పన్ను గురించి తప్పుగా చూపించారంటూ కొంతకాలంగా భాజపా ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఇటీవల ఈ విషయమై నరసింహారావు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అందులో ఆయన మాట్లాడుతూ సినీ నటులపై తప్పుడు వ్యాఖ్యలు చేశారు.
చాలా మంది భారతీయ నటులకి విషయ పరిజ్ఞానం ఉండదన్నారు. దీనిపై మంచు విష్ణు స్పందిస్తూ..‘సినిమా స్టార్లకు జీకే ఉండదు అనుకుంటే.. మరి రాజకీయ నాయకులంతా అవినీతి పరులా? మన దేశానికి చెందిన గొప్ప నటులే గొప్ప రాజకీయవేత్తలు అయ్యా రన్న విషయం మరువద్దు. వారిలో నందమూరి తారక రామారావు, ఎంజీఆర్, జయలలిత ఉన్నారు. ఒకరి అభిప్రాయం చెప్పడానికి జీకే ఉండాల్సిన అవసరం లేదు. నేను భారతీయుడిని. క్రిస్టియన్‌ని వివాహం చేసుకున్నాను. అయినప్పటికీ హిందుత్వాన్ని బాగా నమ్ముతాను. హిందువునని చెప్పుకోవడానికి గర్వపడతాను. నాకు భాజపాపై గౌరవం ఉంది. ప్రధాని నరేంద్రమోదీకి అభిమానిని’ అని తనదైన శైలిలో కౌంటర్ ని కాయిన్ చేశారు.