కుర్ర డైరెక్టర్ సంకల్ప్ తొలి సినిమాతో సంచలనమయ్యాడు. సబ్ మెరైన్ నేపథ్యంలో ఘాజీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రయోగాత్మక పంథాలో సిన్మా తీసి తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు మరో సంచలనానికి తెరలేపనున్నాడని టాలీవుడ్ టాక్. త్వరలో ఈ యువ తరంగం స్వాతంత్ర్య సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ జీవిత కథ ఆధారంగా ఓ చిత్రాన్ని రూపొందించనున్నాడు. అయితే ఈ సినిమాను ఆయన బీ టౌన్‌లో రూపొందిస్తుండడం విశేషం.
అజాద్ హింద్ ఫౌజు దళపతి అయిన నేతాజీ జీవితంపై సుదీర్ఘ కాలంగా పరిశోధించి, ఆయన జీవితంలో వెలుగులోకి రాని విషయాలతో ఈ సినిమా స్క్రిప్ట్ రూపొందుతోందని తెలుస్తోంది. ఇప్పటికే నేతాజీ మరణంపై అనేకానేక అనుమానాలు ఉన్నాయి. వాటికి విరుగుడుగా ఈ సినిమా ఉంటుందా.. లేదా అన్నది ఇప్పటి సందేహం. ఘాజీ సక్సెస్ తరువాత ఆయన చేస్తోన్న సినిమా ఇదే కావడంతో సంకల్ప్ పై బాలీవుడ్ లో విపరీతమైన అంచనాలున్నాయి.
తొలి చిత్రంతోనే ప్రయోగాత్మక, ప్రయోజనాత్మక పంథాలో తెరకెక్కించడంతో ఈ కుర్ర డైరెక్టర్ అక్కడి ఇండస్ట్రీ వర్గాలను తెగ ఆకర్షించాడు. స్టార్లు కాదు స్టోరీనే సిసలైన స్టార్ అని నమ్మిచేసిన ప్రయత్నం ఘాజీ ఫలించడం మనందరికీ తెల్సిందే! ఈ పరంపరకు కొనసాగింపుగా నేతాజీ పై ఓ చిత్రం రూపుదిద్దుకోవడం విశేషమే కదా! ఈ ప్రయత్నం ఫలిస్తే ఆయన నుంచి మరిన్ని ప్రయోగాత్మక, పరిశోధనాత్మక చిత్రాలు, చారిత్రక కథాంశాలతో కూడిన చిత్రాలు వెలువడేందుకు ఆస్కారం ఉంది.