ఎనదర్ సైడ్ : ఇంక్విలాబ్ ఇలానే ఉంటుందా…?
……………………………………………………………….
ల్యాబ్ ల్యాబ్ ల్యాబ్ … పుట్ సమ్ ఎన్క్ డాట్స్ ఎవరు చప్పుడు చేయకుండ్రి. బచ్చన్ వంశంలో ఓ చిన్న బుడతడు ఇటుగా వస్తున్నాడు. వాడి పేరు నీకు తెల్సు. ఏంటది అమితాబ్. 75ఏళ్ల బుడతడు ఏం నేర్పుతున్నాడు.. ఏం నేర్చుకున్నాడు. ఓ చిన్న బంధం బిగ్ బి అనే పదంతో.. ఇంతకూ ఎందులో బిగ్ ఎందులో స్మాల్.. వద్దులే పెద్ద డిస్కషన్ మనకు వద్దు. కోటేసుకున్న కోటీశ్వరుడు అప్పులపాలైన ఓ అనాకారి.. వీటికి మధ్య బిగ్ బి.బి ఫర్ తెలియదు. ఎ ఫర్ తెల్సు. బి ఫర్ బ్యాటిల్ ఎ ఫర్ అమితాబ్ సీ ఫర్ క్యారెక్టర్ ఎల్ ఫర్ లొయాల్టీ వెరసి ఏబీసీఎల్. ఇప్పుడు పొగరు కొంచెం పెంచుకోండి. కాలర్ ఎగరేయండి. ఫుల్ హ్యాండ్ చొక్కని మడతేయండి. ఇప్పుడనండి మాస్ తో పెట్టుకుంటే మడతడిపోద్ది అని!
……………………………………………………………….
రాజ హంస లాంటోడు తెలుగులో రాజహంసనే తీసుకువచ్చాడు. ఒక్కసినిమానే ఏబీసీఎల్ నిర్మించింది.అప్పులు కుప్పలు.. అప్పటికే అన్నీ ఉన్నోడు తరువాత క్షణానికే ఏం లేనోడు. ముంబయ్ దారి అగమ్యంగా తోస్తోంది. ఇంక్విలాబ్ ఈ పేరు అతడికి సూట్ .. అంటే విప్లవం ముందు ఈ పేరే పెట్టారు. హరివంశరాయ్ బచ్చన్ తన స్నేహితుని సలహా మేరకు మార్చారు. అమితాబ్ ఎన్నడూ తగ్గని వెలుగు అని.. ఎందుకో నాన్న మాటనే పాటిస్తాడు. సర్కార్ లా కొరకొర చూసినా వీలున్నంత వరకూ గత కాల తప్పిదాలు వద్దనే అంటాడు. బంగ్లాలు పోయిన వేళ కోట్లు పోయిన వేళ ఒంటరిగా ఉన్న వేళ అతడు బిగ్ బి నే..అది ఎక్కు పెట్టిన తుపాకీ ..
……………………………………………………………….
అమితాబ్ ధర్మేంద్ర కలిస్తే షోలే! అంతటి హిట్ తరువాత మళ్లీ అట్టాంటి హిట్ ఎన్ని సార్లు పలకరించిందో తెలియదు. అసలు తను ఏనాడూ కౌన్ బనేగా కరోడ్ పతి అని ప్రశ్నిస్తాననీ అనుకోలేదు. కొన్ని అంతే! కోడలి పిల్లగా ఐశ్వర్యని తెచ్చుకుంటాననీ అనుకోలేదు.కొన్ని అంతే టేబుల్ ప్రాఫిట్ కొన్ని అంతే ఆస్తులుతో పాటు స్టార్ వాల్యూ పెంచే పనులు.. స్టార్ డమ్ కొన్నిసార్లు ఇబ్బంది.. వెంటనే పా అంటాడు.. స్టార్ డమ్ కొన్ని సార్లు బోర్ వెంటనే నిశ్శబ్ద్ అంటాడు. చీకటి కీ వెలుగుకీ అన్నింటికీ అతడు అలవాటు పడిన ముఖం. ఆర్క్ లైట్ల వెలుగు ఆయన తేజసాన్ని రెట్టిస్తాయను కోవడం పొరపాటు. ఉన్నత స్థాయిని ఏవీ ఉన్నతీకరించి చూపించక్కర్లే యథాతథంగా ఫోకస్ చేస్తే చాలు.అలా బిగ్ బి మనకో ఫోకల్ పాయింట్. డైరెక్టర్స్ యాక్టర్. యాక్టర్స్ హీరో..! జీరో గా మారిన హీరో..! హీరోలకే హీరో! హీరోగా మారిన విలన్.. విలన్‌గా మారిన హీరో ! (కావాలంటే షోలే ఆగ్ చూడండి) ఇంతే ఇంతకుమించి ఏమీ చెప్పరాదు. బంగారం లాంటి మనిషికి ప్లాటినం జూబ్లీ వేడుకలు. చేసుకోవయ్యా చేసుకో మా రాజులా వెండి తెరను ఏలుకో!! ఇంకొంత కాలం. కాదు ఊపిరిన్నుంత కాలం. హ్యాపీ బర్త్ డే బాస్.
(సందర్భం : అక్టోబర్ 11న అమితాబ్ 75వ పడిలోకి వడివడిగా అడుగిడుతున్నారు)
– రత్నకిశోర్ శంభుమహంతి