స్టార్ హీరో కెరీర్లో ల్యాండ్‌మార్క్‌గా నిలిచిపోయిన ఆ సినిమా కథను వాడుకునేందుకు ఇద్దరు కుర్ర హీరోలు పోటీపడుతున్నారట. ఇద్దరు హీరోలు ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడంలేదని గుసగుసలు వినిపిస్తున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ఆయన అభిమానులకు, మూవీ లవర్స్‌కు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా ‘తొలిప్రేమ’. పవన్ కెరీర్లోనే తొలిప్రేమ ఒక ల్యాండ్ మార్క్ అనే విషయాన్ని అందరూ అంగీకరిస్తారు. అలాంటి ‘తొలిప్రేమ’ మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేయాలని మెగాహీరోలందరూ ప్రయత్నించారు. కానీ… వారిలో ఎవరివల్ల అది సాధ్యంకాలేదు.
తాజాగా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ తన కొత్త సినిమాకు ‘తొలిప్రేమ’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో ఆసక్తి పెరిగింది. వరుణ్ తేజ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా స్టోరీ లైన్ కూడా ‘తొలిప్రేమ’ కథ తరహాలోనే ఉంటుందని చిత్ర యూనిట్ ప్రకటించుకుంది.
సినిమా టైటిల్ కూడా ‘తొలిప్రేమ’ అని అఫీషియల్‌గా ప్రకటించడంతో ఇది ‘తొలిప్రేమ’కు రీమేక్‌గా ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఇక కరుణాకరన్ డైరెక్షన్లో నటించేందుకు సిద్ధమైన సాయిధరమ్ తేజ్ కూడా తన కొత్త సినిమా కథ ‘తొలిప్రేమ’ తరహాలో ఉంటుందని గతంలోనే చెప్పేశాడు.
ఈ సినిమాను తెరకెక్కించబోయేది స్వయంగా ‘తొలిప్రేమ’ దర్శకుడు కరుణాకరన్ కావడంతో అతడు మరోసారి తన సూపర్ హిట్ సినిమా స్టోరీని నమ్ముకున్నాడేమో అనే ప్రచారం జోరందుకుంది. అయితే ‘తొలిప్రేమ’ లాంటి ఫీల్ గుడ్ స్టోరీతో ప్రయోగాలు చేయడం కంటే ఇద్దరు హీరోలు కొత్త లవ్ స్టోరీలను నమ్ముకోవడమే బెటరని చాలామంది సలహాలిస్తున్నారట . మెగా ఫామిలీ పెద్దలు ఇది పెద్ద వివాదం కాకుండా వుండే ప్రయత్నం చేస్తున్నారని సమవిహారం .
మొత్తానికి ‘తొలిప్రేమ’ కథపై కన్నేసిన ఇద్దరు హీరోల్లో ఎవరు ఈ సినిమాను రీమేక్ చేస్తారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.