పైసా వసూల్ సినిమా స్టార్ట్ అయినప్పుడే బాలయ్య ఏం చూసుకుని పూరికి కమిట్ అయ్యడ్రా బాబూ అని చాలా మంది తలలు పట్టుకున్నారు. తీరా సినిమా రిలీజ్ అయిన గత శుక్రవారం ఉదయానికే వాళ్ల అంచనాలు నిజమయ్యాయి. థియేటర్లకు వెళ్లిన బాలయ్య అభిమానులు, సాధారణ ప్రేక్షకులు కూడా తలలు పట్టుకుని బయటకు వచ్చారు. ఫలితంగా పూరి ఖాతాలో వరుసగా ఐదో ప్లాప్ పడింది.
ఇన్ని ప్లాపులు ఇస్తున్నా పూరి లోబడ్జెట్‌లో సినిమాలు తీసేయడంతో నిర్మాతలు అతడి గేలానికి చిక్కేస్తున్నారు. అతడు ఓ ప్యాకేజ్ మాట్లాడుకుని సినిమాలు తక్కువ బడ్జెట్‌లో లాగేస్తాడు. కథ ఉండదు, ఒకే లొకేషన్లలో సినిమా లాగించేస్తాడు. దీంతో ప్రేక్షకులకు పూరి సినిమాలు అంటే పారిపోయే పరిస్థితి వచ్చేసింది.
నాలుగు ప్లాపుల్లో ఉన్న పూరికి ఎవ్వరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో భవ్య ఆనందప్రసాద్‌ను, బాలయ్యను పట్టేశాడు. ఈ సినిమా కోసం పూరి బాలయ్య రెమ్యునరేషన్ కాకుండా రూ.30 కోట్ల ప్యాకేజీగా మాట్లాడుకున్నాడట. బాలయ్య రెమ్యునరేషన్ క్రింద 10, పబ్లిసిటీకి 3 కోట్లు కలిపి 43 కోట్లు ఖర్చు పెట్టాడు నిర్మాత ఆనందప్రసాద్.
ఇక పూరి ఒక్క శ్రేయ తప్పా ఎవ్వరిని పేరున్న వాళ్లను పెట్టకుండా సినిమా లాగేశాడు. పోర్చుగల్ ఎపిసోడ్ తప్పా పెద్దగా ఖర్చు పెట్టిందీ లేదు. గత శుక్రవారం రిలీజ్ అయిన ఈ సినిమా మూడు రోజుల్లో రూ.15 కోట్ల షేర్ రాబట్టి, ఆ తర్వాత చేతులు ఎత్తేసింది. అయితే బయ్యర్లకు వచ్చే నష్టాల్లో నిర్మాత ఆనంద్ ప్రసాద్ కొంత వెనక్కి ఇచ్చేలా ఒప్పందం కుదిరిందట. దీంతో అటు పైసా వసూల్ దెబ్బతో అటు నిర్మాత, ఇటు బయ్యర్లు నిండా మునిగితే రూ.30 కోట్ల ప్యాకేజ్ తీసుకుని తక్కువ బడ్జెట్‌లో సినిమా లేపేసిన పూరి మాత్రం బాగా లాభపడినట్టు తెలుస్తోంది.