కింగ్ నాగార్జున నాచురల్ స్టార్ నాని ఇద్దరు కలిసి ఓ మల్టీస్టారర్ మూవీ చేయబోతున్నారు. కొన్నాళ్లుగా చర్చల్లో ఉన్న ఈ సినిమా ఎట్టకేలకు ఫైనల్ అయినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమాకు దర్శకుడిగా శ్రీరాం ఆదిత్య పనిచేయబోతున్నాడట. ఈమధ్యనే నాగ్, నానిల మల్టీస్టారర్ గా ఓ కథ వినిపించాడట. నాగ్, నాని ఇద్దరికి కథ నచ్చేయడంతో సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారు.
భలే మంచి రోజు సినిమాతో దర్శకుడిగా పరిచయమైన శ్రీరాం ఆదిత్య రీసెంట్ గా శమంతకమణి సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. కుర్ర హీరోలు నలుగురితో దర్శకుడు చేసిన ప్రయత్నం కమర్షియల్ గా సక్సెస్ కాకున్నా అతని గట్స్ మాత్రం మెచ్చుకునేలా చేసింది. ఇక నానితో నాగార్జున కలిసి ఈ సినిమా క్రేజీగా ఉండబోతుందట.
ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాలకు మంచి ఊతమిస్తున్న నాగార్జున వరుస సక్సెస్ లతో ఉన్న నానితో ఎలాంటి సినిమా తీస్తాడో చూడాలి. ఈ సినిమాను వైజయంతి బ్యానర్లో అశ్వినిదత్ నిర్మిస్తున్నారని తెలుస్తుంది.