యూసుఫ్‌గూడ పోలీస్ గ్రౌండ్‌లో నేడు జీహెచ్ఎంసీ నిర్వహించిన మెగా హరితహారం కార్యక్రమంలో భాగంగా దాదాపు రెండు లక్షల మొక్కలను నాటడం, పంపిణీ చేపట్టారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మూద్ అలీ, సినిమాటోగ్రఫి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి, ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్, డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్‌లు పాల్గొన్న ఈ హరితహారం కార్యక్రమంలో ప్రముఖ చలన చిత్ర నటుడు బాహుబలి ఫేమ్ దగ్గుపాటి రానా, ప్రముఖ సినీ నటి కేథరిన్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
దాదాపు 175 పాఠశాలలకు చెందిన 8వేల మంది విద్యార్థినీవిద్యార్థులు పాల్గొన్న ఈ హరితహారం హైదరాబాద్ నగరంలో ఇటీవల నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో అతిపెద్దదిగా నిలిచింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మహ్మూద్ అలీ మాట్లాడుతూ ఆకుపచ్చ హైదరాబాద్ రూపకల్పనకు ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ మాట్లాడుతూ మొక్కలు నాటడంతో పాటు వాటి పరిరక్షణకు కృషిచేయాలని అన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ డా.బి.జనార్థన్‌రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో నేటి వరకు 40లక్షల మొక్కలను ప్రస్తుత సీజన్‌లో నాటామని వివరించారు. డిప్యూటి మేయర్ బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ కనీసం ఆరు మొక్కలను నాటడం ద్వారా హరితస్ఫూర్తిని చాటాలన్న ముఖ్యమంత్రి పిలుపును ప్రతిఒక్కరూ పాటించాలని కోరారు.
ఎమ్మెల్యే గోపినాథ్ మాట్లాడుతూ హరితహారంలో హైదరాబాద్ నగరం దేశానికే ఆదర్శంగా నిలువాలని కోరారు. మనకోసం…మన కార్యక్రమం పచ్చదనాన్ని పెంపొందించేందుకు నిర్వహిస్తున్న హరితహారం కార్యక్రమం కేవలం ప్రభుత్వ కార్యక్రమం కాదని, మనకోసం, మన పర్యావరణ పరిరక్షణ కోసం ఈ కార్యక్రమాన్ని కలిసికట్టుగా నిర్వహించేందుకు అందరూ కలిసి రావాలని ప్రముఖ సినీ నటుడు రానా అన్నారు. పూర్వం నాటిన మొక్కలే నేడు మనకు ప్రాణవాయువును అందించడంతో పాటు పచ్చదనాన్ని ప్రసాధిస్తున్నాయన్న విషయాన్ని గుర్తించి భావి తరాల కోసం మొక్కలు నాటేందుకు ప్రతిఒక్కరూ ముందుకు రావాలన్నారు. సినీ నటి కేథరిన్ మాట్లాడుతూ మొక్కలు నాటే కార్యక్రమాన్ని పలు సందర్భాల్లోనే కాకుండా ప్రతిఒక్కరూ తమ జీవితంలో హాబీగా మల్చుకోవాలన్నారు. జన్మదినం, వివాహ దినోత్సవం వంటి శుభ సందర్భాల్లో కూడా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.