సినిమా పారితోషకానికి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ పొందిన పన్ను మినహాయింపుపై నోటీసులు జారీ అయినట్టుగా తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్‌కు ఇచ్చిన పన్ను మినహాయింపును కాగ్ తప్పు పట్టగా.. ఈ వ్యవహారంలో ఈ హీరోకి నోటీసులు జారీ చేస్తున్నట్టుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. మరి ఏమిటీ వ్యవహారం అని ఆరా తీస్తే… అనుచితమైన రీతిన ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది.
ఇది ‘నాన్నకు ప్రేమతో’ సినిమా పారితోషకానికి సంబంధించిన వ్యవహారం.ఆ సినిమాకు గానూ ఎన్టీఆర్ 7.33 కోట్ల రూపాయల పారితోషకాన్ని తీసుకున్నాడట. లెక్క ప్రకారం అందులో కోటీ పది లక్షల రూపాయల పన్ను కట్టాల్సి ఉండగా, ఎక్స్‌పోర్ట్ ఆఫ్ సర్వీస్ కింద తారక్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. కట్టాల్సిన పన్నును చెల్లించకుండా అలా మినహాయింపు పొందడంపై కాగ్ అక్షేపణ తెలిపింది.న్టీఆర్ కు నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. ‘నాన్నకు ప్రేమతో’ సినిమాను పూర్తిగా లండన్ లో చిత్రీకరించిన విషయం తెలిసిందే.
అలా చేసిన సినిమా కాబట్టి.. దానికి గానూ తీసుకున్న పారితోషకాన్ని ‘సేవల ఎగుమతులు’ కింద చూపుతూ ఎన్టీఆర్ పన్ను మినహాయింపును పొందినట్టుగా తెలుస్తోంది. కేవలం ఎన్టీఆర్ మాత్రమే కాకుండా, మరికొంతమంది సినిమా హీరోలు కూడా ఈ ఎత్తుగడను అనుసరిస్తున్నట్టు సమాచారం. వారికి కూడా ఐటీ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయని సమాచారం. పూర్తిగా విదేశాల్లో చిత్రీకరించిన సినిమాల విషయంలో వారు ఇలాంటి మినహాయింపులను పొందినట్టుగా తెలుస్తోంది.