Politicsజీవన్ దాన్ అంబాసిడర్‌ గా పవన్... జనసేన అధినేత సుముఖత

జీవన్ దాన్ అంబాసిడర్‌ గా పవన్… జనసేన అధినేత సుముఖత

సీఎం చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ల భేటీలో పలు అంశాలపై చర్చ జరిగింది. ఉద్దానం, పోలవరం, రాజధాని, మంజునాధ్ కమిషన్ సహా.. తాజా రాజకీయ పరిణామాలపై ఇద్దరి మధ్య చర్చ జరిగింది. పవన్ ఉద్దాన్ బాధితుల అంశంపై చొరవ తీసుకోవడం తనకు సంతోషం కలిగించిందని చంద్రబాబు పేర్కొన్నారు. ఎంతో మంది కిడ్నీ బాధితుల సమస్యను తనదిగా భావించి సమస్య పరిష్కారానికి హార్వార్డ్ వైద్య బృందాన్ని సైతం రప్పించిన పవన్ జీవన్‌దాన్ కార్యక్రమానికి సరైన అంబాసిడర్‌గా చంద్రబాబు భావించారు.అర్ధాంతరంగా తనువు చాలించిన వారి నుంచి అవయవాలను సేకరించి ఆపదలో ఉన్న వారికి అమర్చేలా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న కార్యక్రమం ‘జీవన్ దాన్’. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా పవన్ కల్యాణ్ వ్యవహరించనున్నారు.ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపాదనకు జనసేన అధినేత సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఉద్దానం కిడ్నీ సమస్యపై వైద్యుల బృందం నివేదికను ఇచ్చిన పవన్‌ .. సచివాలయంలో సీఎంతో ఏకాంతంగా భేటీ అయ్యారు. ఈ భేటీలో వారి మధ్య ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తుల సమస్యలతో పాటు, పోలవరం, రాజధాని నిర్మాణం, మంజునాథ కమిషన్‌ నివేదిక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.ఉద్దానం కిడ్నీ సమస్య పరిష్కారానికి పవన్‌ కల్యాణ్‌ చొరవ తీసుకోవడం అభినందనీయమని చంద్రబాబు అన్నారు.ఉద్దానం కిడ్నీ సమస్య 30 ఏళ్లుగా పీడిస్తూనే ఉందని, అయినప్పటికీ సరైన కారణాలు కనుగొనలేకపోయారని చెప్పారు. సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తూనే ఉందని పేర్కొ్న్నారు. హార్వర్డ్‌ వైద్య బృందం సూచనలు పరిగణనలోకి తీసుకుని కిడ్నీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొంటామన్నారు. వ్యాధిగ్రస్తులకు ఉపశమనం కల్గించే అనేక చర్యలు ప్రభుత్వం తీసుకుందన్నారు.

ఏకాంత భేటీ అనంతరం హర్వర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జోసెఫ్‌తో పాటు వైద్యుల బృందంతో కలిసి పవన్‌ ముఖ్యమంత్రితో సమావేశమయ్యారు. పరిశోధనలో తేలిన అంశాలను డాక్టర్ జోసెఫ్ సీఎంకు వివరించారు. ఉద్దానం కిడ్నీ సమస్యపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య.. వైద్య బృందానికి వివరించారు.

శ్రీకాకుళం జిల్లా సోంపేటలో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని, కావాల్సిన పరికరాలను తీసుకొచ్చేందకు కేంద్రం నుంచి అనుమతులు ఇప్పించాల్సిందిగా సీఎంను జోసెఫ్ కోరారు.ఉద్దానంలో ఇప్పటికే మూడు ప్రత్యేక డయాలసిస్ సెంటర్లను ఏర్పాటుచేసినట్లు పూనం మాలకొండయ్య వెల్లడించారు. మరో 14 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయని వైద్య బృందానికి వివరించారు. అలాగే కిడ్నీ బాధితులకు రూ. 2,500 పెన్షన్ అందించాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. కిడ్నీ వ్యాధి నిపుణులకు నియమిచింది బాధితులకు మరింత వైద్య సాయాన్ని అందిస్తామని చెప్పారు.

ఎండలో పనిచేస్తూ సరిపడా నీరు తీసుకోకపోవడం వల్ల డీహైడ్రేషన్‌ ఏర్పడిందని హార్వార్డ్ మెడికల్ స్కూలు బృందం పేర్కొంది. పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడటం వల్లే కిడ్నీ సమస్యలు తలెత్తాయని వెల్లడించింది. ప్రధానంగా తాగునీటిలో సిలికా ప్రభావం ఉండడం వల్ల.. కిడ్నీవ్యాధి ఎక్కువగా వ్యాపించినట్టు వైద్య నిపుణుల బృందం సీఎంకు వివరించింది.అంతకు ముందు ఉద్ధానం బాధితులు సీఎం చంద్రబాబుకు వివరించేందుకు పవన్ విజయవాడ వచ్చారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా వెలగపూడి వెళ్లిన పవన్ కు ఫ్యాన్స్ నుంచి ఘనంగా స్వాగతం లభించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news