టాలీవుడ్ హీరో నవదీప్ పక్కా ప్రణాళికతో సిట్ అధికారుల ముందు హాజరైనట్లున్నారు. అందుకే అధికారులు ఎన్ని ప్రశ్నలు వేసినా దాటవేశారు. కొన్నింటికి మౌనం వహించారు. తనకు డ్రగ్స్ అలవాటు లేదని బుకాయించారు. అయితే అధికారులు పలు ఆధారాలు చూపించి ప్రశ్నించగా దానిపై మౌనం వహించారు. దీంతో ఆయనకు డ్రగ్స్ అలవాటు ఉందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. నవదీప్ నుంచి రక్త నమూనా, గోళ్లు, వెంట్రుకలు సేకరించాలని సిట్ అధికారులు వైద్యులను పిలిపించారు. ఆ సమయంలో శాంపిల్స్ ఇస్తారా? అని అధికారులు నవదీప్‌ను ప్రశ్నించారట. అయితే దానికి నవదీప్ నిరాకరించాడు. అందుకే నవదీప్ నుంచి ఎలాంటి నమూనాలను అధికారులు సేకరించలేదు.
డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా సోమవారం హీరో నవదీప్‌ను ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారించింది.వాస్తవానికి సిట్ అధికారుల వద్ద నవదీప్‌కి సంబంధించిన సమాచారాం చాలానే ఉంది. గచ్చిబౌలిలోని బీపీఎం పబ్ ఆయనదేనని, పబ్‌లో డ్రగ్స్‌ను వినియోగిస్తున్నారని అధికారుల వద్ద సమాచారం ఉంది. సినీ పరిశ్రమలో పలువురు ప్రముఖుల ఇళ్లలో జరిగే ఈవెంట్లను నవదీప్ నిర్వహిస్తుంటారు. అక్కడ కొంతమందికి డ్రగ్స్ అందుతున్నట్లు అధికారులు సమాచారం సేకరించారు. ఇవే విషయాలను అధికారులు నవదీప్‌ను ప్రశ్నించారు.
ఒకదానిపై ఒకటి ప్రశ్నలను సందిస్తూ ఉక్కిరిబిక్కిరి చేశారు. కానీ నవదీప్ మాత్రం జంకు బొంకు లేకుండా వాటన్నిటినీ దాటవేసినట్లు సమాచారం.చాలా ప్రశ్నలకు ఆయన నాకు తెలీదు అనే సమాధానమే ఇచ్చారట. డ్రగ్స్ అలవాటు ఉందా? అసలు డ్రగ్స్ ఎక్కడ నుంచి తెస్తారు? అని అధికారులు అడిగే.. అలాంటి అలవాట్లు తనకు లేవని చెప్పినట్లు తెలుస్తోంది. తమది సంప్రదాయ కుటుంబమని, డ్రగ్స్ పేరుతో అనవసరంగా నిందలు వేయొద్దని అధికారులను కోరారట. దీంతో అధికారులు తమ వద్ద ఉన్న కొన్ని వీడియో క్లిప్పింగులు, వాట్సాప్ మెసేజ్‌లు, ఫోన్ కాల్స్‌ను చూపించారు. అయితే దీనిపై నవదీప్ ఎలాంటి సమాధానం ఇవ్వకుండా మౌనం వహించారట. డ్రగ్స్ విషయంలో పూరీ జగన్నాథ్‌తో సంబంధం ఉందా అని కూడా అధికారులు ప్రశ్నించారట. అయితే అతనితో అలాంటి సంబంధాలేవీ లేవని నవదీప్ చెప్పినట్లు సమాచారం.