`వీఐపీ 2` సినిమాతో త్వరలో మనముందుకు రానున్న దర్శకురాలు సౌందర్యా రజనీకాంత్ ఎప్పటికైనా చిరంజీవితో కలిసి ఓ సినిమా చేయాలనుందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. ఒకవేళ ఆ అదృష్టమే వస్తే దేవుడికి కోటి సార్లు కృతజ్ఞతలు చెబుతా అంటోంది రజనీకాంత్ తనయ. అంతేకాకుండా రజనీకాంత్‌ను డాన్‌గా చూడాలని ఉందని, త్వరలో హ్యారీపోట్టర్ లాంటి సినిమాను తీస్తానని సౌందర్య చెప్పుకొచ్చింది.
`కొచ్చడయాన్` సినిమా పెద్దగా విజయం సాధించకపోయినా, దేశంలో మొదటి మోషన్ క్యాప్చర్ సినిమాను రజనీకాంత్‌ను హీరోగా పెట్టి తీసినందుకు చాలా గర్వపడుతున్నట్లు ఆమె అంది. `వీఐపీ 2` సినిమా గురించి మాట్లాడుతూ – `ఈ సినిమాను చాలా కష్టపడి తీశాం. 20 ఏళ్ల తర్వాత కాజోల్ దక్షిణాది సినిమాలో నటించారు. వసుంధరా పరమేశ్వరన్ పాత్రకు కాజోల్ తప్ప వేరే ఎవ్వరూ న్యాయం చేయలేరని ఆమెను సంప్రదించాం` అని వివరించింది. అలాగే ఈ సినిమాలో అవసరమైన చోట అమ్మ సెంటిమెంట్ జోడించామని, సినిమా పూర్తి చేయడంలో సహకరించినందుకు తన తల్లికి రుణపడి ఉన్నానని సౌందర్య తెలిపింది.