కొందరు ‘బాహుబలి’ కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. భారీ యుద్ధ సన్నివేశాల వల్లే ఆడేసిందని అంటారు. కానీ బేసిగ్గా కథ బాలేకుంటే.. ఎమోషన్లు పండకుంటే.. నటీనటుల అభినయం బాలేకుంటే సినిమా ఆడదన్న ప్రాథమిక సూత్రాన్ని ఎవ్వరూ మరవకూడదు. ‘బాహుబలి’లో ప్రతి నటుడు.. ప్రతి నటీ తమ పాత్రలకు న్యాయం చేసిన సంగతి గుర్తించాలి. ఇందులోని నటీనటులందరూ తమ అత్యుత్తమ ప్రతిభను చాటుకున్నారు. ఒకరితో ఒకరు పోటీ పడి నటించారు. మరి వీరిలో ‘ది బెస్ట్’ ఎవరు అంటే రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతాయి. ఐతే ఈ చిత్ర దర్శకుడు రాజమౌళిని ఇదే ప్రశ్న అడిగితే ఏమంటాడు..? ఆయన దృష్టిలో ‘బాహుబలి’లో అందరికంటే బాగా నటించింది ఎవరు..?
ఈ ప్రశ్నకు రాజమౌళి సమాధానం.. నాజర్. ఆయనకే రాజమౌళి ఓటేయడానికి కారణం లేకపోలేదట. మిగతా వాళ్ల పాత్రలు చాలా బలంగా ఉన్నాయని.. సరైన పాత్ర లేకపోయినా దానికి నాజర్ తన నటనతో వెయిట్ తీసుకొచ్చాడని అంటున్నాడు రాజమౌళి. ‘‘బాహుబలి సినిమాలో అందరూ బ్రహ్మాండంగా చేశారు. అందరి క్యారెక్టర్లకూ వెయిట్ ఉంది. కానీ బిజ్జాలదేవుడి క్యారెక్టర్‌కు వెయిట్ చాలా తక్కువ. ఆ క్యారెక్టర్ లేకపోయినా సినిమాకు ఇబ్బంది ఉండదు. ఐతే ప్రతి సీన్‌లో నాజర్ ‘నేనున్నాను’ అనిపించేలా నటనతో మెప్పించారు. అందుకే ఆయనే ‘ది బెస్ట్’ అంటాను’’ అని రాజమౌళి తెలిపాడు. ఇక నటి విషయానికొస్తే అనుష్క కి ఓటేశాడు మన జక్కన్న.అనుష్క సినిమా మొదటి నుండి చివరి వరకు ఒకే దర్పంతో ఎంతో హుందాగా 100% పాత్రకు న్యాయం చేసింది అని వివరణ ఇచ్చాడు.