దాసరి నారాయణరావు, పద్మను ప్రేమ వివాహం చేసుకున్నారన్న విషయం ఆయనతో పరిచయమున్న వారికి తెలుసేమో కానీ, ఆ ప్రేమ వెనకున్న కథ చాలా కొద్ది మందికే తెలుసు. ఆ ప్రేమ కథ హైదరాబాద్ లోని పాత బస్తీలో పుట్టింది. దాసరి నారాయణరావు నాటకాలు వేస్తూ, చిరు ఉద్యోగం చేస్తూ హైదరాబాద్ లో ఉంటున్న సమయంలో చెల్లెలికి గాజులు కొనే ఉద్దేశంతో సుల్తాన్ బజార్ వెళ్లారు. అక్కడో గాజుల దుకాణంలో, ఏ సైజ్ గాజులు కావాలి? అని యజమాని అడుగగా, పక్కనే ఉన్న ఓ అమ్మాయిని చూపించి ఆ సైజులోవి కావాలి అని అడిగారట.
ఈ సందర్భంగా ఆ అమ్మాయితో దాసరి మాటలు కలిశాయి. తనకు పరిచయమైన అమ్మాయిని తాను ప్రదర్శించబోయే నాటిక చూసేందుకు రావాలని కూడా దాసరి ఆహ్వానించారు. ఆపై ఆమె నాటిక చూసేందుకు రావడం పరిచయం అలా అలా పెరగడం జరిగిపోయింది. ఆ అమ్మాయే పద్మ. వారి పరిచయం ప్రేమగా మారగా, పరిణయంతో ఆ జంట ఒకటై దాదాపు ఐదు దశాబ్దాల పాటు ప్రయాణించింది.