ఒక రాష్ట్ర పాలనకు గుండెకాయ లాంటిది సచివాలయం. అలాంటి సచివాలయం ఎంతలా పని చేస్తుందన్న దానిపైనే అభివృద్ధి కార్యక్రమాల దగ్గర నుంచి.. ప్రభుత్వ కార్యక్రమాలు.. విధానపరమైన అంశాలు.. పాలనా పరమైన వ్యవహారాలు ముందుకు వెళ్లే అంశాలు ముడిపడి ఉంటాయి. అలాంటి సచివాలయం పూర్తి కట్టుదప్పితే జరిగే నష్టం అంతాఇంతా కాదు.
ఏపీ సచివాలయం పరిస్థితి ఇంచుమించు ఇదే తీరులో ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తొందరపాటుతో హైదరాబాద్ నుంచి హడావుడిగా అమరావతికి తీసుకొచ్చినప్పటికీ.. అక్కడి ఉద్యోగుల్లో మాత్రం అమరావతిలో ఉండి పని చేయాలన్న భావనను తీసుకురాలేకపోయారు. దీంతో.. ఏ మాత్రం అవకాశం వచ్చినా.. సచివాలయం హోల్ సేల్ గా ఖాళీ అవుతోంది.
తాజాగా చంద్రబాబు అమెరికా పర్యటన కారణంగా.. ఏపీ సచివాలయానికి వస్తున్న అధికారుల హాజరు శాతం బాగా తగ్గిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక.. వీకెండ్స్ కు కాస్త ముందు నుంచే ఉద్యోగుల హాజరు లేదన్న మాట వినిపిస్తోంది. దీనికి తోడు.. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు మరణించటంతో ఏపీ సచివాలయం పూర్తిగా బోసిపోయింది.