ఒరిజినల్లో ఒక నటుడు అద్భుతంగా చేశాడని పేరు తెచ్చుకున్నాక.. రీమేక్ మూవీలో ఎంత బాగా చేసినా అంత పేరు రాదు. ఒరిజినల్లోని హీరో లాగే చేస్తే కాపీ అంటారు. మార్చి చేస్తే అంత బాగా చేయలేదంటారు. కానీ ‘గురు’లో వెంకీ పెర్ఫామెన్స్ చూస్తే మాత్రం ఒరిజినల్లో మాధవన్ పెర్ఫామెన్స్ చూసి ఫిదా అయిపోయిన వాళ్లు కూడా వెంకీకి సలాం కొడతారు. అంత బాగా ఆది పాత్రను పండించాడు వెంకీ. ఆయన లుక్.. బాడీ కూడా ఈ పాత్రకు సరిగ్గా సూటయ్యాయి. లుక్ పరంగా మాధవన్ కంటే కూడా మెప్పించాడు వెంకీ.
సుధ తనకు పరిచయస్తురాలు కావడంతో మాధవన్ ‘ఇరుదు సుట్రు’ స్క్రిప్టుతో చాలా కాలం ట్రావెల్ చేశాడు. అతను ఆ చిత్రానికి అడిషనల్ స్క్రీన్ ప్లే కూడా అందించాడు. పాత్రను బాగా ఆకళింపు చేసుకోవడం వల్ల మరింత ఇన్వాల్వ్ అయి నటించాడు. అందుకే సినిమా చూస్తుంటే.. మాధవన్ కనిపించడు. అతడి పాత్ర మాత్రమే కనిపిస్తుంది. ఒక నటుడు అంతగా ఇన్వాల్వ్ అయి చేసిన పాత్రలో నటించి మెప్పించడం అంటే అంత సులువైన విషయం కాదు. కానీ వెంకీ ఆ టాస్క్ ను దిగ్విజయంగా పూర్తి చేశాడు. కొన్ని సన్నివేశాల్లో వెంకీ హావభావాలు మాధవన్ ను మించిపోయాయి. ముఖ్యంగా ఇంటర్వెల్ ముందు తన శిష్యురాలు కావాలని ఓడిపోతోందన్న బాధతో కళ్లతో హావభావాలు పలికించిన తీరు.. ప్రి క్లైమాక్స్ లో వచ్చే ఎమోషనల్ సీన్లో వెంకీ నటించిన వైనం అమోఘం. ఈ సినిమా కోసం వెంకీ శారీరకంగా.. మానసికంగా చాలా ఎఫర్టే పెట్టాడు. అందుకు తగ్గ ఫలితమే వచ్చేలా ఉంది బాక్సాఫీస్ దగ్గర.