News మోడీ, చంద్రబాబు, వెంకయ్యలపై ని(త)ప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్

మోడీ, చంద్రబాబు, వెంకయ్యలపై ని(త)ప్పులు చెరిగిన పవన్ కళ్యాణ్

Janasena party president Pawan Kalyan fire on PM Narendra Modi, CM Chandrababu Naidu and Central Minister Venkaiah Naidu in his latest press meet for not solving Andhra Pradesh problems.

‘ప్రత్యేకహోదా’ కోసం ఏపీ యువత విశాఖలోని ఆర్కే బీచ్ వద్ద మౌనపోరాటం చేసేందుకు రంగంలోకి దిగగా.. అది ప్రారంభం కాకముందే ప్రభుత్వం భగ్నం కలిగించింది. వచ్చిన ప్రతిఒక్కరినీ అరెస్ట్ చేయించింది. కనీసం గంటైనా వారిని ఉద్యమించే సమయం కేటాయించకుండా అదుపులోకి తీసుకుంది. దీంతో.. ఈ పోరాటానికి మద్దతుగా నిలిచిన జనసేనాధిపతి పవన్ కళ్యాణ్ ప్రభుత్వం తీరుపై, స్పెషల్ స్టేటస్ ఇస్తానని చెప్పి హ్యాండిచ్చిన ప్రధాని నరేంద్రమోడీపై మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పవన్.. ప్రజా సమస్యలపై పార్టీలు అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆయన విమర్శించారు.

పవన్ మాట్లాడుతూ.. ‘అప్పట్లో అటు కేంద్రం, ఇటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రజా సమస్యల్ని పట్టించుకోకుండా, రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించింది. ఆ పార్టీ అలా చేయడం వల్లే నేను బీజేపీ, టీడీపీలకు మద్దతు ప్రకటించాను. గుజరాత్‌ను అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన మోదీ ప్రధాని అయితే దేశం బాగుపడుతుందని.. అలాగే పరిపాలన అనుభవం ఉన్న చంద్రబాబు సీఎం అయితే ఆంధ్రప్రదేశ్‌కు మంచి జరుగుతుందన్న ఉద్దేశంతోనే వారికి మద్దతుగా ప్రచారం చేశా. అలా చేసినందుకు ‘నీకు రాజకీయాలు తెలుసా? అనుభవం ఉందా?’ అని ఎవరూ అడగలేదు కానీ.. ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే మాత్రం ‘నీకు రాజకీయాలు ఏం తెలుసు?’ అంటూ విమర్శిస్తున్నారు. దీనికంటే అవకాశవాదం ఎక్కడైనా ఉంటుందా? మోదీ అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అనుకున్నా. కానీ ఆయన అన్ని విషయాల్లోనూ ఒంటెద్దు పోకడ కొనసాగిస్తున్నారు. రోహిత్‌ వేముల, నోట్ల రద్దు అంశాల్లో మోదీ ఒంటెద్దు పోకడ స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల మనోభావాలు పట్టించుకోకుండా.. మీరనుకున్నది చేయడమే ప్రజాస్వామ్యమా?’ అని పవన్ ప్రశ్నించారు.

ఇంకా పవన్ ఏమన్నారంటే.. ‘చంద్రబాబుకి పరిపాలన అనుభవం ఉంది కాబట్టే ఆయనకు సపోర్ట్ చేశా. ప్రచార సమయాల్లో నేను చెప్పింది కూడా అదే. కానీ.. ఆయన ప్రత్యేక హోదా విషయంలో తప్పు చేస్తున్నారు. అసలు ఆయన ఈ అంశంలో వెనకడుగు ఎందుకు వేశారో అర్థం కావడం లేదు. ఈ విషయంలో బాబు ఎందుకు కాంప్రమైజ్‌ అయ్యారో ఆయన ప్రజలకు కచ్చితంగా వివరించి తీరాల్సిందే. ‘అమరావతి’ని సింగపూర్‌‌లా గొప్ప రాజధానిలా నిర్మిస్తానని చెప్పిన బాబు.. సుజనాచౌదరి లాంటి వ్యక్తిని వెంటబెట్టుకుని తిరుగుతుండటం సిగ్గుచేటు. నిజానికి ఆయనతో నాకు శత్రుత్వం లేదు కానీ.. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన సుజనాలాంటి వ్యక్తి నుంచి ఏం స్పూర్తి నేర్చుకోవాలి? ఇక పోలవరం విషయానికొస్తే.. ఆ ప్రాజెక్ట్ నిర్మాణంలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయని నాకు సమాచారం వస్తోంది. ఈ సమస్యలన్నింటినీ మీరు ఎప్పటికప్పుడు గమనిస్తూ పరిష్కారం చూపాల్సి ఉంది. ప్రత్యేక హోదా కోసం యువత శాంతియుతంగా ఆందోళన చేసుకుంటామంటే ఎందుకు అడ్డుకున్నారు. జనవరి 26వ తేదీన అందరూ కలిసి కేంద్రానికి తమ వాయిస్ వినిపిద్దామనుకున్న ఆ యువత గొంతుకు ఎందుకు కళ్లెం వేశారు. వారికి కనీసం ఒక గంటైనా సమయం ఇస్తే నిరసన చేపట్టి ఎవరి దారిన వారు వెళ్లిపోయేవారు. అనవసరంగా యువతను రెచ్చగొట్టడం సరికాదు. ఈరోజున ఒక ఉధృతిని మీరు ఆపారు.. వాయిదా వేయగలిగారు.. అంతేగానీ తీవ్రతను ఆపలేరు. నమ్ముకున్న సిద్ధాంతాల కోసం నేను ఎలాంటి త్యాగానికైనా సిద్ధం. ప్రజల కోసం కుటుంబాన్నే వదిలివచ్చిన నాకు మీతో సంబంధం తెంచుకోవడం కష్టమేమీ కాదు.’ అంటూ పవన్ హెచ్చరించారు.

ఇక వెంకయ్య నాయుడు మీద పవన్ మండిపడుతూ.. ‘ఆయన ప్రత్యేక హోదాపై రోజుకో మాట మాట్లాడుతున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్లు కావాలని పార్లమెంటులో డిమాండ్‌ చేసిన ఆయన.. అధికారంలోకి రాగానే అదేమీ సంజీవని కాదని వ్యాఖ్యానించడం దారుణం. స్వర్ణభారత్‌ ట్రస్టుపై ఆయన పెట్టిన శ్రద్ధ హోదాపై పెడితే.. ఇప్పటికే ఈ సమస్య తీరుండేంది. ప్రత్యేక హోదా తెలుగు ప్రజల హక్కు.. ప్రసాదించడానికి మీరేమన్నా దేవుళ్లా. మేమంతా మీ బానిసలమా? రామ మందిరం గురించి పట్టించుకుంటారు గానీ.. 4కోట్ల ప్రజల సమస్యను మాత్రం ముందుకు తీసుకెళ్లలేకపోతున్నారు’ అని అన్నారు.

‘కేంద్రంలోకి బీజేపీ, ఏపీలో టీడీపీలోకి అధికారంలోకి వచ్చి మూడేళ్లయ్యింది. ఇన్నాళ్లూ ప్రభుత్వాల్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలేవీ నేను సంధించలేదు. ప్రతి విషయంపై ప్రశ్నిస్తే.. ప్రభుత్వాలు ఇబ్బందికి గురి అవుతాయని, తద్వారా ప్రజలు కూడా ఇబ్బందులు పడుతారని భావించా. అందుకే ఇన్నాళ్లూ మౌనంగా ఉన్నా.. అంతేగానీ.. వాళ్లని వెనకేసుకుని రావడం లేదు’ అని పవన్ వివరించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news