Tollywood’s ace actor Jagapathi Babu finalised as villain in Ram Charan’s 11th film. Sukumar directing this project and bankroled by Mythri Movie Makers.
అదిగో, ఇదిగో అంటూ ఎన్నోసార్లు వాయిదా పడుతూ వచ్చిన రామ్ చరణ్ – సుకుమార్ కాంబో చిత్రం ఎట్టకేలకు జనవరి 30వ తేదీన లాంఛనంగా ప్రారంభమైంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ మూవీకి సంబంధించి తాజాగా ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో విలన్‌గా ఓ పవర్ఫుల్ నటుడ్ని ఎంపిక చేశారని సమాచారం. ఆతనెవరో కాదు.. జగపతిబాబు.
తాను తీయబోతున్న ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్‌కి జగపతి పూర్తిగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో.. సుకుమార్ ఆయన్నే ఎంపిక చేశాడని తెలిసింది. ఇదివరకే వీరిద్దరూ ‘నాన్నకు ప్రేమతో’ సినిమా చేసిన విషయం తెలిసిందే. అందులో స్టైలిష్‌గా, సాఫ్ట్‌గా కనిపిస్తూనే విలనిజాన్ని పండించాడు జగ్గూభాయ్. ఇప్పుడు మరోసారి సుక్కు డైరెక్షన్లో ఆయన విలన్‌గా నటిస్తుండడంతో.. ఆ పాత్ర చాలా ప్రత్యేకంగా, ఆసక్తి రేకెత్తించేలా ఉంటుందని చెప్పుకుంటున్నారు. ఇండస్ట్రీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ చిత్రం విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోంది కాబట్టి, జగ్గూభాయ్ ఆ పల్లెటూరి సర్పంచ్ పాత్ర పోషిస్తున్నాడని అంటున్నారు. ఆల్రెడీ విలన్‌గా తనకంటూ ప్రత్యేక ముద్ర వేయించుకున్న జగపతి.. ఆ పాత్రలో సరిగ్గా ఒదిగిపోతాడని, చరణ్ చిత్రానికి సుక్కు సరైన విలన్ని ఎంపిక చేశాడని చెప్పుకుంటున్నారు.
‘మైత్రీ మూవీ మేకర్స్’ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ ఇస్తున్నాడు. రత్నవేలు ఛాయాగ్రహణం అందిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ని వీలైనంత త్వరగా ముగించి.. ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.