Gautamiputra Satakarni movie in new controversy for making historical mistakes. L Panduranga complaints on this movie and demanding to take back tax exemptions.
చారిత్రక నేపథ్యంతో ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారంటే.. చిత్రబృందం ముందుగా ఎంతో విశ్లేషిస్తుంది. ఏ అంశంపై అయితే వాళ్లు సినిమా తీయాలనుకుంటారో.. దాని గురించి చాలా లోతుల్లో పరిశీలిస్తుంది. వీరితోపాటు చరిత్రకారులు కూడా ఉంటారు. అది దాదాపు నిజమేనని ఓ అంచనాకి వచ్చాకే.. సినిమాని సెట్స్ మీదకి తీసుకెళతారు.
దర్శకుడు క్రిష్ కూడా అలాగే చేశాడు. క్రీ.శ.1-2 మధ్యకాలానికి చెందిన శాతవాహన చక్రవర్తి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ గురించి పూర్తి విషయాలు విశ్లేషించి.. ఆ తర్వాతే సినిమాని తెరకెక్కించాడు. తాను చెప్పినట్లుగానే ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించాడు. గణ రాజ్యాలుగా భారతావనని ఏకతాటిపై తీసుకొచ్చిన శాతకర్ణి జీవితాన్ని, గొప్పతనాన్ని తెలుగు ప్రజలకు, భావి తరాలకు తెలిసేలా అద్భుతంగా తీశాడు. దీంతో.. అతనికి ఎందరో ప్రముఖుల నుంచే కాకుండా, ఇతర పరిశ్రమల నుంచి కూడా ప్రశంసలు వచ్చి పడుతున్నాయి. అటు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు కూడా ఈ సినిమాకి పన్ను మినహాయింపును ఇచ్చి గౌరవించింది.
కానీ.. ప్రస్తుతం ఈ సినిమా కొత్త వివాదంలో చిక్కుకుంది. ప్రముఖ చరిత్రకారుడు, రాయల్ హిస్టారికల్ సొసైటీ లండన్ సభ్యుడు, వాయిస్ ఆఫ్ తెలంగాణ నాయకుడు కెప్టెన్ ఎల్.పాండురంగా రెడ్డి ఈ చిత్రంలో చాలా తప్పులున్నాయంటూ ముందుకొచ్చాడు. ఈ చిత్రంలో చూపించిన శాతకర్ణి చరిత్ర వాస్తవం కాదని, ఈ చిత్రానికిచ్చిన పన్ను రాయితీని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాడు. అసలు శాతకర్ణి కోటిలింగాల్లో పుట్టలేదని, ఆయన తల్లి గౌతమి బాలశ్రీ ఆనవాళ్లు మహారాష్ట్రలో ఉన్నాయని ఆయన వాదిస్తున్నాడు.
అంతేకాదు.. అప్పట్లో శాతకర్ణి కుమారుడు పులోమావి విధిలేని పరిస్థితుల్లో అమరావతికి వచ్చాడని, పైగా సినిమాలో చూపినట్టు ఆ కాలంలో గుర్రపు జీనులు వాడే సాంప్రదాయం కూడా లేదని ఆయన పేర్కొంటున్నాడు. ఇలాంటి తప్పిదాల వల్ల చరిత్ర వక్రీకరించబడిందని, దీనిపై దర్శకుడు క్రిష్ వివరణ ఇవ్వాలని కోరాడు. మరి.. దీనిపై శాతకర్ణి టీమ్ ఎలా రియాక్ట్ అవుతుందో వేచి చూడాలి.