Exclusive analysis on Balayya’s 100th project Gautamiputra Satakarni. Krish directed this film under first frame entertainment banner.
‘గౌతమీపుత్ర శాతకర్ణి’ ప్రారంభోత్సవంనాడే ఈ సినిమా తెలుగువారు గర్వించదగేలా ఉంటుందని యూనిట్ చెప్పింది. ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ క్రిష్‌తోపాటు బాలయ్య కూడా అదే మాట చెబుతూ వచ్చారు. వారు నొక్కి వక్కాణిస్తున్నట్లుగా ఇది తెలుగు వారు గర్వించే చిత్రం అనడంలో సందేహం లేదు. ‘బాహుబలి’ రేంజ్‌లో విజువల్ వండర్ అయితే కాదు కానీ.. విషయ ప్రధానంగా చూస్తే మాత్రం ఆ మూవీ కంటే ‘శాతకర్ణి’నే మిన్నగా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంత గొప్పగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు క్రిష్. సాధారణంగా చారిత్రాత్మక చిత్రాలంటే భారీతనం నిండి ఉంటుంది. పెద్దపెద్ద భవంతులు, కళ్లుచెదిరే విజువల్స్, వేలాదిమంది సైనికులు తప్పనిసరి. వీటితోపాటు బలమైన కథ కూడా ఉండాలి. అప్పుడే.. ఆ సినిమా జనాల్లోకి వెళుతుంది. అదే.. క్రిష్ కూడా చేశాడు. ఓ హిస్టారికల్ మూవీలో ఏ హంగులైతే ఉండాలో.. వాటిని జోడించడంతోపాటు బ్రహ్మాండమైన కథని సిద్ధం చేసుకుని, ఈ చిత్రాన్ని ఓ కళాఖండంగా రూపొందించాడు.
ఈ మూవీలోని మొదటి సన్నివేశమే ఆడియెన్స్‌లో పూనకాలు తెప్పించేలా ఉంటుంది. గణ రాజ్యాలున్నప్పుడు పాలకులందరూ రాజ్యాధికారం కోసం యుద్ధాలు చేసుకుంటుంటే.. ఎందుకలా అందరూ కొట్టుకుంటున్నారని తన తల్లి గౌతమీతో శాతకర్ణి చెబుతాడు. ‘ప్రజలు కొట్టుకోవడం లేదు.. అధికారం చలాయించడం కోసం పాలకులు అలా గొడవ పడుతున్నారు’ అని ఆమె బదులిస్తుంది. అప్పుడు.. ‘ఇన్ని రాజ్యాలు కాకుండా ఒకే రాజ్యంగా ఉంటే గొడవలు ఉండవు కదా’ అని అంటాడు. ‘మరి గణ రాజ్యాలను ఒక్కటిగా చేసే వీరుడు పుట్టాలి కదా’అని గౌతమీ తల్లి ప్రశ్నిస్తే.. ‘నేను పుట్టాను కదా’ అని శాతకర్ణి గర్జిస్తాడు. అదే ఈ చిత్రాన్ని పతాకాస్థాయిలోకి తీసుకెళుతుంది. దీని తర్వాత వచ్చే మరో సన్నివేశం ఉంది. తన పరాక్రమాన్ని గౌరవించి రాజ్యాన్ని అప్పగించమంటూ శాతకర్ణి ఒక దూత ద్వారా అవతలి రాజుకు వర్తమానాన్ని పంపుతాడు. దాంతో.. ఆ రాజుకు పౌరుషం వస్తుంది. దూతను ఉద్దేశించి ‘నిన్ను బంధిస్తే’ అని రాజు అనగా.. ‘వారొస్తారు. నేను కారాగారంలో ఎదురు చూస్తుంటా’ అని దూత అంటాడు. దాంతో ఆ రాజుకి మరింత కోపం వస్తుంది. అప్పుడు ‘నిన్ను వధిస్తే’ అంటూ రెట్టించి అడగ్గా.. ‘మీరొస్తారు. నేను కాటికాడ ఎదురు చూస్తుంటా’ అని ఆ దూత బదులిస్తాడు. దీన్ని బట్టే.. ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆ సంభాషణ వచ్చినప్పుడు థియేటర్లు విజిల్స్‌తో మారిమోగిపోతాయి. మరో సన్నివేశం ఏంటంటే.. యుద్ధంలో తన చేతిలో ఓడిపోయాక ఒక రాత్రి శాతకర్ణి ముందు తల వంచుతాడు. అప్పుడు శాతకర్ణి వెంటనే.. ‘తల వంచకు.. అది నేను గెలిచిన తల’ అని అంటాడు. ఇంతకంటే గూస్‌బంప్స్ తెప్పించే సన్నివేశం ఏముంటుంది చెప్పండి.
గొప్ప చరిత్ర నేపథ్యం వున్న ఈ చిత్రాన్ని.. శాతకర్ణి పుట్టుక, బాల్యం, యవ్వనం, రాజుగా ఆధిపత్యం, ఇంకా ఇతరత్ర అధ్యాయాలు చూపించకుండా నేరుగా అతని లక్ష్యం చుట్టే కథని నడిపించాడు. దక్షిణ భారతాన్ని గుప్పెట్లోకి తెచ్చుకునే ఘట్టంతోనే శాతకర్ణి పరిచయ దృశ్యాన్ని ఆవిష్కరించిన క్రిష్.. ఆ తర్వాత మొత్తం భారతాన్ని తన చేతుల్లోకి తెచ్చుకోవడం.. చివరగా పరదేశీయులతో పోరాడి గెలవడంతో కథ ముగిసిపోతుంది. ఈ మధ్యలో సొంత కొడుకునే రణరంగంలోకి తీసుకెళ్లడం.. భార్యే శాతకర్ణితో తీవ్రంగా విభేదించడం.. భావోద్వేగాల నడుమ కథ నడుస్తుంది. సినిమాలో ప్రతి సన్నివేశం శాతకర్ణి లక్ష్యంతో ముడిపడే ఉంటాయి. దాన్నుంచి క్రిష్ ఎక్కడా డీవియేట్ కాకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ విషయంలో అతనికి ఎన్ని మార్కులు వేసినా తక్కువే. ఇక యుద్ధ సన్నివేశాలైతే హాలీవుడ్‌ని తలపించేలాగే చూపించాడు క్రిష్. తక్కువ బడ్జెట్‌లోనే ఆద్యంతం ఆకట్టుకునేలా ఆ సీన్స్‌ని క్రిష్ తెరకెక్కించాడంటే.. అస్సలు నమ్మశక్యం కాదు. అది కూడా ఈ చిత్రం షూటింగ్‌ని 79 రోజుల్లో కంప్లీట్ మరో విశేషం.
ఇక బాలయ్య నటన గురించి చెప్పుకుంటే.. ఆయన శాతకర్ణి పాత్రలో ఎంతగా లీనమయ్యారో సినిమా చూస్తే కానీ అర్థమవదు. ఈ పాత్రకు ఆయన తప్ప మరెవ్వరూ న్యాయం చేయలేరేమో అనేంతగా అద్భుత అభినయం ప్రదర్శించాడు. నటనలో ఏ ఒక్క సన్నివేశంలోనూ బాలయ్యకు వంకలు పెట్టడానికి లేదు. పాత్రకు తగ్గ రౌద్రం.. వాచకంతో తిరుగులేని రీతిలో నటించాడు బాలయ్య. ఇక ఆయన డైలాగ్ డెలివరీ గురించి అందరికీ తెలిసిందే. ఇందులో మరింత వీరోచిత డైలాగులతో బాలయ్య చెలరేగిపోయాడు. సాయి మాధవ్ బుర్రా రాసిన మాటల్ని పలికి విధానానికి బాలయ్యకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆయన కెరీర్‌లోనే ఇది ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఈయన తగ్గట్టుగానే హేమమాలిని, శ్రియా శరన్‌లు కూడా అద్భుత అభినయం కనబరిచారు. సాంకేతికంగానూ ఈ చిత్రానికి వందకు వంద మార్కులు పడతాయి. సినిమా చూస్తున్నంతసేపు మనం శాతవాహనుల కాలంలో ఉన్నామేమో భావన కలుగుతుంది. క్రిష్ కథకి తగ్గట్టుగా సినిమాటోగ్రఫర్ అంతటి ప్రతిభని చాటుకున్నాడు. చిరంతన్ భట్ పాటలు, నేపథ్య సంగీతం చాలా బాగా కుదిరాయి. ఓవరాల్‌గా చెప్పాలంటే.. ఈ సినిమా కచ్చితంగా ఇది తెలుగువారు గర్వించదగ్గ చిత్రమే.